విశాఖ భీమిలి నియోజకవర్గం....టీడీపీ ఆవిర్భావం నుండి ఆపార్టీకి కంచుకోట...2004, 09 ఎన్నికల్లో తప్ప...మిగతా అన్నీ ఎన్నికల్లో పసుపు జెండానే ఎగిరింది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు...37వేల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో భీమిలిలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరుపున గెలిచిన అవంతి శ్రీనివాస్...ఈ సారి భీమిలి వైసీపీ అభ్యర్ధిగా నిలబడ్డారు. ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న అక్రమాని విజయ నిర్మలని విశాఖ తూర్పులో తెదేపా నేత వెలగపూడి రామకృష్ణపై పోటీకి దింపారు. అటు గంటా కూడా రాజకీయ కారణాల వలన విశాఖ ఉత్తరంలో టీడీపీ తరుపున నిలిచారు.


దీంతో తెదేపా చాలరోజులుగా గట్టి అభ్యర్ధిని వెతుకుతూ...విశాఖలో సీనియర్ నేతగా ఉన్న సబ్బం హరిని పార్టీలోకి తీసుకుని భీమిలి పోరులో దింపింది. అటు అవంతి ఇటు సబ్బం పోటీకి దిగడంతో భీమిలి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సబ్బంకి గతంలో అనకాపల్లి ఎంపీగా, విశాఖ మేయర్‌గా చేసిన అనుభవం ఉంది. విశాఖ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. అలాగే గవర సామాజికవర్గంలో ఆయనకి మంచి పట్టు ఉంది. సౌమ్యుడుగా ఉన్న సబ్బంకి భీమిలిలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక వీరిద్ద‌రు అన‌కాప‌ల్లి ఎంపీలుగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న‌వారే.


ఇక అటు అవంతికి ఆర్ధికంగా సబ్బం కంటే బలవంతుడు...2009లో ప్రజారాజ్యం తరుపున భీమిలి నుండి గెలుపొందిన అనుభవం కూడా ఉంది. దీంతో నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్నాడు. అలాగే సబ్బంలాగే అవంతి కూడా అనకాపల్లి ఎంపీగా చేశారు. పైగా అవంతి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు నుండే భీమిలిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బరిలో దిగిన సబ్బం హరికి ఎక్కువ టైమ్ కూడా లేదు. మరి ఈ తక్కువ టైమ్‌లో సబ్బం ప్రజలని ఏ మేర తనవైపు తిప్పుకుంటారో చూడాలి. అలాగే ఆర్ధికంగా బలంగా ఉన్న అవంతిని ఢీకొట్టేందుకు సబ్బంకి గంటా సాయం చేస్తారని తెలుస్తోంది. మరి చూడాలి చివరికి భీమిలిలో ఎవరు పై చేయి సాధిస్తారో..



మరింత సమాచారం తెలుసుకోండి: