పవిత్ర పుణ్యక్షేత్రం, భక్తులకు కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలపై కొలువైన ప్రాంతం తిరుపతి. అయితే ఎన్నికల సమయం కావడంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. 1952లో ఏర్పాటైన తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడబోతున్నాయి. అప్పుడే ప్రచారాన్ని ముమ్మరం చేశారు నేతలు. టీడీపీ, వైసీపీ, జనసేనలకు ఇక్కడ మంచి బలమైన క్యాడర్ ఉంది.


మరో వైపు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. జాతీయ పార్టీలు కాంగ్రేస్, బీజేపీ తమ ఉనికి చాటుకోవడం కష్టమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుగుణమ్మ భర్త మరణంతో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. అందులో సుగుణమ్మ కు సెంటిమెంట్ బాగా కలిసివచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో కన్నుమూశారు. 2016 లో వచ్చిన ఉపఎన్నికల్లో వెంకటరమణ సతీమణి సుగుణమ్మ భారీ మెజారిటీతో మరోసారి టీడీపీ జెండా ఎగురవేశారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి దివంగత వెంకటరమణ తన ప్రత్యర్థి అయిన వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు నువ్వానేనా అన్న రీతిలో పోరు సాగింది.


ఫలితాల్లో మాత్రం వెంకటరమణ 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా టీడీపీలో చాప కింద నీరులా అసంతృప్తులు, ఆధిపత్య పోరు కొనసాగుతుందని ప్రచారం సాగుతుంది. మరోవైపు సుగుణమ్మ అనుచరులు చేసే అక్రమాలను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అని ప్రజలు చెబుతున్నారు. ఇక వైసీపీ పార్టీలో అన్ని తానై ఉన్న భూమన కరుణాకరరెడ్డి కి కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ బలమైన జనసేన పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు అంటున్నారు ప్రజలు. దీంతో త్రిముఖ పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు ఎవరిపై ఉంటాయి అనేది ప్రశ్నార్థకం.

మరింత సమాచారం తెలుసుకోండి: