తెలంగాణ స‌మితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. శాసనమండలిలో త్వరలో ఖాళీ అయ్యే నాలుగుస్థానాల్లో రెండింటికి టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారుచేశారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగరానికి చెందిన కుర్మయ్యపాటి నవీన్‌కుమార్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిర్ణయించారు. అయితే, ఎవ‌రీ న‌వీన్ అనే అంశం స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది. 


వాస్త‌వానికి ఈ ఇద్ద‌రిని లోక్‌సభ బరిలో నిలపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచించారు. అయితే, సామాజిక సమీకరణాలు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో వీలుకాలేదు. ఈ నేపథ్యంలో వీరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. త్వ‌ర‌లో ఆయ‌న‌కు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.


ఇక అంద‌రి చూపు నవీన్‌కుమార్‌పై ప‌డింది. టీఆర్ఎస్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, 2001 నుంచి ఆయన కుటుంబం పార్టీకి అండగా నిలుస్తూ వచ్చింది. పార్టీ బహిరంగసభలు, ప్లీనరీలు, సమావేశాల్లో నవీన్‌కుమార్ ముఖ్యపాత్ర పోషిస్తూ వస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా కీలకపాత్ర పోషించారు. జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో చురుకుగా వ్యవహరించి, పార్టీ అభ్యర్థుల విజయంలో ముఖ్యభూమిక పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: