తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం...విభిన్న తీర్పుకి పెట్టింది పేరు... రాష్ట్రంలో ఓటరు తీర్పు ఒకవైపు ఉంటే ఇక్కడ మాత్రం వేరే రీతిలో ఉంటుంది. ఏ పార్టీకి పూర్తిగా అవకాశమివ్వదు. ఎప్పటికప్పుడు విజేతలను మారుస్తుండటం ఈ నియోజకవర్గం విశిష్టత. అదే సమయంలో పనిచేసే నేతలకు ఇక్కడ ప్రజలు పట్టం కడతారని పేరుంది. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎస్‌వి‌ఎస్‌ఎన్ వర్మ 47వేల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబుపై విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన వర్మ వెంటనే తెదేపాలో చేరారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా వర్మ తెదేపా నుండి బరిలో ఉండగా....పెండెం దొరబాబు వైకాపా నుండి పోటీ చేస్తున్నారు.


అయితే ఎప్పటికప్పుడు విభిన్న తీర్పుని ఇస్తున్న పిఠాపురం వాసులు ఈసారి ఎవరిని గెలిపించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  ఇక గత ఎన్నికల్లో గెలిచిన మెజారిటీ కంటే భారీ మెజారిటీతో గెలుస్తానని వర్మ ధీమాగా ఉన్నారు. ఆయన గత ఐదేళ్లలో పిఠాపురంలో అభివృద్ధి బాగానే చేశారు. దూకుడుగా ఉండి అధికారులతో పనులు చేయిస్తారని పేరుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేశారు. వర్మ ఆర్ధికంగా కూడా బలంగా ఉన్నారు. అదే సమయంలో స్వయానా పవన్ కల్యాణ్ వర్మపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వర్మ పేకాట క్లబ్బులు నడుపుతారని, అందరినీ దూషిస్తారని విమర్శలు చేశారు. ఇవి కొంత వర్మకి మైనస్ కానున్నాయి. అలాగే రెండు దశాబ్దాలుగా ఒక్కసారి గెలిచిన వారికి మరోసారి ఛాన్స్ ఇచ్చిన చరిత్ర పిఠాపురం చరిత్రలో లేకపోవడం వర్మకి ఇబ్బంది కానుంది.


అటు గత ఎన్నికల్లో ఓడిపోయిన పెండెం దొరబాబు మళ్ళీ వైసీపీ నుండి బరిలోకి దిగుతున్నారు. ఓడిపోయిన ఆయన ప్రజలతోనే ఉన్నారు. జగన్ పాదయాత్ర తర్వాత వైసీపీ మైలేజ్ పెరిగింది. ఇవి దొరబాబుకి ప్లస్ కానున్నాయి. అదేవిధంగా పిఠాపురం సెంటిమెంట్ కూడా కలిసిరావొచ్చు. కానీ వర్మ అంత స్ట్రాంగ్‌గా దొరబాబు లేరు. ఇక జనసేన నుండి మాకినీడు శేషుకుమారి పోటీ చేస్తున్నారు.

నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ ఉండటం జనసేనకి ప్లస్ కానుంది. గతంలో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది. దీంతో మిగతా రెండు పార్టీలకి జనసేన గట్టి పోటీ ఇస్తుంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం మండల ఓటర్లు వుంటారు. అలాగే ఇక్కడ కాపు, శెట్టిబలిజ, చేనేత కార్మికులు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు ఓటర్లు ఎక్కువ ఉన్నారు. వీరే ఇక్కడ గెలుపోటములని ప్రభావితం చేస్తారు. మరి విభిన్న తీర్పునిచ్చే పిఠాపురం ప్రజలు ఈ సారి ఎవరిని ఆదరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: