తెలంగాణ‌లో ఓవైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరు హాట్ హాట్‌గా జ‌రుగుతున్న త‌రుణంలో మ‌రో కీల‌క ఎన్నిక జ‌రుగుతోంది. అదే ఎమ్మెల్సీ ఎన్నిక‌. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్; వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్ నేడు జ‌రుగుతోంది. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 472 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 185 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రతి వెయ్యిమంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. 


కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి 17 మంది బరిలో నిలవగా 1,96,321 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఏడుగురు పోటీ చేస్తుండగా 23,214 మంది, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది పోటీ చేస్తుండగా 20,888 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరిగే జిల్లాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. పట్టభద్రులు ఎక్కువగా ఉండటంతో.. ప్రైవేట్ సంస్థలు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ప్రతి వెయ్యిమంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లు అధికంగా ఉండటంతో మండలానికి ఒకటి, ఉపాధ్యాయ నియోజకవర్గంలో తక్కువగా ఉండటంతో రెండు మండలాలకు కలిపి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.  ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరుగనుంది.


తాజా ఎన్నిక‌ల‌పై సీఈవో రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బ్యాలెట్ పత్రాలను జిల్లాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించినట్టు వెల్లడించారు. ఎలాంటి అలజడులు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశామని, పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేశామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తామన్నారు. పోలింగ్ ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. వికలాంగ ఓటర్లు పోలింగ్‌కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్టు తెలిపారు. సాధారణ ఓట్ల మాదిరిగా కాకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈసీ వివరించింది. పోలింగ్ బూత్‌కు తప్పకుండా గుర్తింపుకార్డును తీసుకువెళ్లాలని.. ఎన్నికల కమిషన్ సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: