‘పిల్లనిచ్చిన మామగారినే చంద్రబాబునాయుడు ఏం చేశారో అందరూ చూసిందే’..ఇవి తాజాగా సంచలన సినీనటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు.  శ్రీవిద్యా నికేతన్ కు రావాల్సిన ఫీజు రీ ఎంబర్స్ మెంటు కోసం తిరుపతిలో మోహన్ బాబు తన విద్యార్ధులతో కలిసి ధర్నా చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకునే రకం కాదన్నారు. ఇచ్చిన హమీలను అవసరం తీరిపోయాక పక్కన పడేసే రకం చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.

 

గడచిన మూడేళ్ళుగా చంద్రబాబు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇవ్వటం లేదన్నారు. దాదాపు రూ 20 కోట్ల బకాయిలు రావాల్సున్నా నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు మండిపడ్డారు. బకాయిల కోసం ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రయోజనం కనిపించలేదన్నారు.

 

పార్టీ గురించి మాట్లాడుతూ, టిడిపి నాది నాదని చంద్రబాబు అనటంలో అర్ధం లేదన్నారు. టిడిపిని పెట్టింది ఎన్టీయార్ అన్నారు. ఎన్టీయార్ నుండి పార్టీని చంద్రబాబు లాక్కున్నట్లు చెప్పారు. అంటే అప్పట్లో పార్టీని లాక్కున్నపుడు మోహన్ బాబు కూడా చంద్రబాబుకే మద్దతు తెలిపారు లేండి. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నపుడు కుటుంబసభ్యులే పట్టించుకోనపుడు మనకెందుకు ? అన్నారు.

 

చంద్రబాబు మాటలను ఎవ్వరూ నమ్మరని కూడా చెప్పారు. ఇదే ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ను మోహన్ బాబు ఆకాశానికెత్తేశారు. తాను రాజకీయాలు మాట్లాడటానికి ఇక్కడకి రాలేదంటూనే చంద్రబాబు కడిగిపారేశారు. ఈరోజు టిడిపిలో ఉన్న చాలామందిలో ఎన్టీయార్ పై అభిమానంతో ఉన్నవారే అని కూడా అన్నారు. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు రోడ్డెక్కటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: