గ‌త కొద్దికాలంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌లు నిలుస్తూ ఇటీవ‌లి కాలంలో టీఆర్ఎస్ పార్టీకి చేరువ అవుతున్న‌ట్లుగా మాట్లాడుతున్న  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ప్లేటు ఫిరాయించేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావుపై మాత్రం విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో త‌న‌కు విబేధాలు లేవ‌ని...తాను విభేదించేదంతా హరీశ్‌రావుతోనేనని, తనను జైల్లో పెట్టించింది ఆయనేనని ఆరోపించారు. ఉనికి కోసం హరీశ్‌ తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు. హరీశ్‌తో పోలిస్తే కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించారు. హరీశ్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను వీడతారని తాను అనుకోవడం లేదన్నారు. ఇలా సానుకూల వ్యాఖ్య‌లు చేసిన జ‌గ్గారెడ్డి త్వ‌ర‌లో టీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. 


అయితే, తాజాగా దీనికి జ‌గ్గారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. తాను టీఆర్ఎస్‌లో చేర‌బోవ‌డం లేద‌న్నారు. టీఆర్‌ఎస్‌లోకి రావాలని తనను ఎవరూ అడగలేదని జగ్గారెడ్డి చెప్పారు. అయినా తనను టీఆర్‌ఎస్‌లోకి తీసుకోర‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. తన నివాసంలో ఆయన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. 'నేను చెప్పిన మాట విననని టీఆర్‌ఎస్‌కు తెలుసు. అందుకే వారికి ఇష్టం ఉండదు' అన్నారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే.. 'నా బిడ్డ నిర్ణయమే ఫైనల్‌' అని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరున్నా...పోయినా...భవిష్యత్తు మాత్రం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.


ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్‌కు మంట పుట్టించే మాట‌ల‌ను జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. కారు..సారు..ప‌ద‌హారు పేరుతో  పార్లమెంటు సీట్ల‌పై క‌న్నేసిన కేసీఆర్...భారీ ఆశ‌లు పెట్టుకుంటే...జ‌గ్గారెడ్డి మాత్రం వేరే మాట చెప్పారు. మ‌ల్కాజ్‌గిరిలో రేవంత్‌రెడ్డి, న‌ల్ల‌గొండంలో ఉత్తమ్‌, భువ‌న‌గిరిలో కోమటిరెడ్డి, చేవెళ్ల‌లో విశ్వేశ్వరరెడ్డితో పాటు ఖమ్మంలో కాంగ్రెస్ గెలుస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌, సికింద్రాబాద్‌ సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. 2023 ఎన్నికల నాటికి ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: