తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఈ సారి ఎన్నికల్లో అదిరిపోయే ఫైట్ జరగనుంది. తెదేపా తరుపున రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప…వైకాపా తరుపున ఎంపీ తోట నరసింహం భార్య వాణి బరిలో ఉండటంతో పెద్దాపురం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పైగా వీరు ఇద్దరు స్థానికేతరులే కావడం విశేషం. రాజప్పది అమలాపురం కాగా, తోట కుటుంబం జగ్గంపేట. ఇక 2014 ఎన్నికల్లో రాజప్ప పెద్దాపురం నుంచి బరిలోకి దిగి...వైకాపా అభ్యర్ధి తోట సుబ్బారావుపై విజయం సాధించారు. రాజప్ప చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కావడంతో హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.


ఇక ఎమ్మెల్యేగా రాజప్ప నియోజకవర్గంలో మున్నెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అటు సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అందాయి.   వీటితోపాటు పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు 8 కిలోమీటర్ల మేర రూ.35 కోట్లతో విస్తరించిన రోడ్డు పనులు నియోజకవర్గంలో హైలైట్‌. ఇక వివాదరహితుడుగా మంచి తెచ్చుకున్న రాజప్ప...ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారు. అయితే రాజప్పపై వివాదాస్పద అసైన్డ్‌ భూముల్లో అక్రమ మైనింగ్‌ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. అలాగే పార్టీలో వివాదాలను సమన్వయం చేసుకోలేకపోవడం రాజప్పకి మైనస్. అటు టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు రాజప్పకి ఎంతవరకు సహకరిస్తారు అనేది అనుమానమే.


మరోవైపు 2014లో తెదేపా నుండి కాకినాడ ఎంపీగా గెలిచిన తోట నరసింహం అనారోగ్య కారణాల ఈసారి లోక్‌సభకు పోటీచేయలేనని.. తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అక్కడ జ్యోతుల నెహ్రూ బరిలో ఉండడంతో చంద్రబాబు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. దీంతో నరసింహం ఆమె భార్య వాణితో కలిసి వైసీపీలో చేరారు. ఇక జగన్ రాజప్పకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో వాణికి పెద్దాపురం టికెట్ ఇచ్చారు. తోట ఫ్యామిలీకి దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర ఉండటం.. పెద్దాపురంలో బంధుత్వాలు... భర్త అనారోగ్యం సానుభూతిగా మారడం ఇవన్నీ వాణికి ప్లస్ కానున్నాయి. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన డిప్యూటీ సీఎంని ఢీకొట్టాల్సి రావడం, ఆర్ధికగా ఖర్చుకు వెనుకాడటం... వీరికి బలమైన నాయకుల మద్దతు లేకపోవడం మైనస్ అవుతుంది.


అటు జనసేన నుండి తుమ్మల రామస్వామి బరిలో ఉన్నారు. గతంలో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్ధి గెలవడం, కాపు ఓటర్లు ఎక్కువ ఉండటం కలిసొస్తాయి. కానీ తెదేపా, వైకాపా అభ్యర్డులు కూడా అదే కులానికి చెందినవారు కావడం...అన్నీ విధాలా బలంగా ఉండటం జనసేన పోటీ ప్రభావం ఎక్కువ ఉండదు. అయితే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం సామర్లకోట, పెద్దాపురం మునిసిపాలిటీలు, రెండు రూరల్‌ మండలాలకు విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ కాపు, కమ్మ సామాజికవర్గాలు అధికంగా ఉన్నాయి. తరువాత బీసీ సామాజికవర్గం, ఎస్సీ సామాజికవర్గం. కాపు, కమ్మ ఓటర్లు అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపనున్నారు. మరి చూడాలి ఈసారి పెద్దాపురం పోరులో పైచేయి ఎవరిదో …


మరింత సమాచారం తెలుసుకోండి: