టీఆర్ఎస్ పార్టీలోని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగే అభ్య‌ర్థుల విష‌యంలో అంచ‌నాలు త‌ల‌కిందులు అయిన నేత‌లు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సిట్టింగ్ ఎంపీకి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మొండిచేయి ఇవ్వడంతో... కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.


గురువారం రాత్రి 8 గంటలకు ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ 17 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ముగ్గురు సిట్టింగులకు టికెట్లు కేటాయించలేదు. అందరూ ఉహించినట్టుగానే జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), సీతారామ్‌నాయక్‌(మహబూబాబాద్‌)లకు రిక్తహస్తం చూపించారు. ఆయా స్థానాల్లో కొత్తవారికి టికెట్లు కేటాయించి కేసీఆర్‌ వారికి షాక్‌నిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు సహకరించకుండా వెన్నుపోటు పొడిచారనే నివేదిక గులాబీ బాస్ దగ్గర ఉండడంతో... టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో టీడీపీలో ఉన్న నామా నాగేశ్వరరావును పార్టీకి ఆహ్వానించి... ఆయనకు ఖమ్మం టికెట్ ఇచ్చారు. 


దీంతో పొంగులేటి త‌న దారి తాను చూసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం. ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక నేతలకు ఎవరికీ ఆయన అందుబాటులోకి రావడం లేదు. ఇవాళ జరిగిన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతల సమావేశానికి కూడా పొంగులేటి డుమ్మా కొట్టారు. దీంతో పొంగులేటి పార్టీ మార్పు ఖాయ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: