రాజకీయ పార్టీల నేతలన్నాక కొంతైనా సహనం ఉండాలి. అలా కాకుండా చిత్తానికి ఏది పడితే అటు తిరిగితే చివరకి కెరీర్ మాత్రమే కాదు. నమ్మకం కూడా కోల్పోతారు. అందుకు అచ్చమైన ఉదాహరణ విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతల రామక్రిష్ణ వ్యవహారం.వైసీపీకి దూరమైన కొణతాల అప్పట్లోనే టీడీపీలో చేరితే ఈ పాటికి జిల్లాలో చక్రం తిప్పే పరిస్థితి ఉండేది. 


అయితే నాడు బిగిసి కూర్చున్న ఆయన తాను సీనియర్ నని తన డిమాండ్లకు అన్ని పార్టీలు తల వొగ్గి ముందుకు వస్తాయని అతికి వెళ్ళారు. ఫలితంగా ఈనాడు ఎటూ కాకుండా పోయారని అంటున్నారు విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్  పొలిటీషియన్ గా ఉన్న కొణతాల రామక్రిష్ణ ఈ మధ్య కాలంలో వేసినన్ని పిల్లిమొగ్గలు మరే నాయకుడు వేయలేదంటే అతిశయోక్తి లేదేమో. ఓ వైపు టీడీపీ, మరో వైపు వైసీపీ ఇలా రెండు పార్టీలతో దాగుడు మూతలు ఆడుతూ వచ్చారు. 


ఇక పవన్ జనసేన గురించి కూడా కన్నేసి ఉంచిన ఈ మాజీ మంత్రి గారు చివరకు టీడీపీ, వైసీపీ రెండింటిలో ఎదో ఒక దానిలో చేరాలనుకుని రాయబేరాలు బాగానే నడిపాననుకున్నారు. అయితే ఈ సీనియర్ నాయకుని నిలకడలేనితనాన్ని గమనించిన ఆ పార్టీలు పెద్దగా  పట్టించుకోలేదు. కొణతాల తాను సీనియర్ నేతనని తన వద్దకే పార్టీలు వస్తే పెద్ద డిమాండ్లే పెట్టాలనుకున్నారు. ఓ దశలో టీడీపీలో చేరమంటే అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు కోరారని టాక్.


దాంతో వ్యవహారం అక్కడ బెడిసికొట్టడంతో రాత్రికి రాత్రి వైసీపీ వైపుగా అడుగులు వేశారు. ఇక జగన్ పార్టీలో చేరిపోవడం ఖాయమని అంతా అనుకుంటున్న వేళ అక్కడ కూడా తన షరతుల కధ వినిపించేసరికి జగన్ వెనక్కి తగ్గారని టాక్. ఆ తరువాత మళ్ళీ టీడీపీ అంటూ ఏకంగా అమరావతి వెళ్ళి చంద్రబాబును కలసినా టికెట్లు అక్కడ అప్పటికే అయిపోయాయి. పైగా టీడీపీ సైతం కొణతాల వైఖరి పట్ల కొంత అసహనంగా ఉండడంతో ఆయన్ని అలా వదిలేసింది. చివరాఖరుకి  ఎన్నికల వేళ  ఏ పార్టీలోనూ టికెట్ ఏదీ లేకపోగా భేషరతుగా టీడీపీలో చేరుతున్నానని చెప్పడమే కొణతాల వారికి మిగిలింది. ఎన్నికల్లో టీడీపీ విజయానికి తాను క్రుషి చేస్తానని కొణతాల చెప్పుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: