ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో త్రిముఖ పోటీ జరగబోతోంది. అధికార టిడిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ సుగుణమ్మ, ప్రధాన ప్రతిపక్షం వైసిపి నుండి మాజీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి, జనసేన తరపున మాజీ ఎంఎల్ఏ చదలవాడ కృష్ణమూర్తి రంగంలో నిలిచారు.  జనసేన అభ్యర్ధి మార్చే అవకాశం ఉందని చెబుతున్నా ఇప్పటికైతే చదలవాడే అభ్యర్ధి.

 

ఇక అభ్యర్ధు విషయానికి వస్తే సుగుణమ్మ, చదలవాడ ఇద్దరు కూడా బలిజ (కాపు) సామాజికవర్గానికి చెందిన వారే. సరే వైసిపి సామాజికవర్గం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదునుకోండి. విచిత్రమేమిటంటే ముగ్గురు అభ్యర్ధులకు ప్లస్సులు, మైనస్సులున్నాయి. పార్టీలు బలంగా ఉన్న అభ్యర్ధులపై జనాల్లో పూర్తిస్ధాయి సానుకూలత కనబడటం లేదు.

 

ముగ్గురు అభ్యర్ధులకు కూడా ఇటువంటి విచిత్ర పరిస్దితి ఎందుకు వచ్చింది ? ఎందుకంటే, సుగుణమ్మ, కరుణాకర్ పై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. అదే సందర్భంలో చదలవాడపైన అవినీతి ఆరోపణలు తక్కువే అయినా వ్యక్తిత్వాన్ని ఎవరూ ఇష్టపడటం లేదు. ఎదుటివాళ్ళతో అవసరం ఉంటేనే మర్యాదిచ్చి మాట్లాడుతారు చదలవాడ. అవసరం లేదనుకున్నా, తీరిపోయినా చాలా చులకనగా మాట్లాడుతారు. చదలవాడ ఎంఎల్ఏగా, టిటిడి బోర్డు ఛైర్మన్ గా ఉన్నపుడు ఆయన్ను అడ్డుపెట్టుకుని బంధువులు, సామాజికవర్గంలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

 

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీల మీద సానుకూలత ఉన్నా ముగ్గురు అభ్యర్ధులపైనా వ్యతిరేకతుంది. ఇక సామాజికవర్గాలపరంగా చూస్తే తిరుపతిలో బలిజల ఓట్లు ఎక్కువున్నాయి. తరువాత బ్రాహ్మణులు, యాదవులు, రెడ్లు, ఎస్సీలున్నారు. నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ఓరియెంటెడ్. ఉద్యోగులు, విద్యావేత్తలు, వ్యాపారులు ఎక్కువ.

 

టిడిపి, జనసేన అభ్యర్ధులు ఇద్దరూ బలిజలే కాబట్టి సామాజికవర్గం ఓట్లు చీలే అవకాశం ఉంది. అందులోను సుగుణమ్మతో పడకే చదలవాడ టిడిపిలో నుండి జనసేనలో చేరారు. ఆర్ధిక విషయానికి వస్తే ముగ్గురూ చాలా బలమైన వారే. అంగబలం కూడా పుష్కలంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, బలిజ ఓట్లలో చీలిక తదితర అంశాలు కలిసివస్తే వైసిపి గెలుపు తథ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: