విశాఖ ఎంపీ సీటు అంటేనే వలస పక్షులకు ఎందుకో తగని మమకారం. ఎక్కడ నుంచో ఎగిరి మరీ ఇక్కడ వాలిపోతాయి. పార్లమెంట్ ఎల్లలు కూడా తెలియని వారు ఇలా వచ్చి అలా గెలిచేస్తూంటారు. ఇది ఇవాళా నిన్నా కధా కాదు, మూడు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ అంతే నాన్ లోకల్ అని ఫిక్స్ అయిపోయిందంతే. అన్ని పార్టీలు ఇపుడు అదే బాట పట్టడం విశేషం. లొకల్ ఎమ్మెల్యే, ఎంపీ అంటూ గట్టిగా గొంతు చేసిన పవన్ కళ్యాణ్ కూడా దిగుమతి సరుకునే బరిలోకి దించేశారు. విశాఖను కాపాడడానికి ఇక్కడెవరూ లేనట్లుగా మాజీ పోలీస్ అధికారే దిక్కు అన్నట్లుగా పవన్ మాట్లాడేశారు. పాతిక లక్షల జనాభా కలిగిన విశాఖ మహా నగరంలో ఎంపీ సీటుకు పోటీ చేయడానికి అర్హుడెవరూ లేనట్లుగా అందరూ పరాయి జిల్లాల వారినే మీదకెక్కించేశారు. ఇపుడు విశాఖ ఓటరు వీరిలో ఒకరిని ఎన్నుకుని నాన్ లోకల్ ఎంపీ పేరుని మరో మారు ఖాయం చేయాలన్నమాట.


విషయానికి వస్తే ఎక్కడో కడపలో పుట్టి కర్నూల్లో  చదివిన మాజీ జేడీ లక్షీనారాయణ విశాఖ ఎంపీగా జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు విశాఖలో పోటీ చేస్తే గెలిచేస్తానని బాగా నమ్మకమట. ఇక్కడ నాన్ లొకల్ ని బాగా  నెత్తికెక్కించుటారని విశ్వాసమట. పవన్ రాయలసీమలో పోటీకి పెట్టాలని చూసినా ఇక్కడే పోటీ అంటూ వచ్చేశారు. పవన్ సైతం విశాఖ భూ కబ్జాలను  అరికట్టేందుకు కొత్త  కొత్వాల్ ని తెచ్చామంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ కొత్వాల్ ఎన్నికల్లో ఓడనా, గెలిచినా   మళ్ళీ విశాఖ గడప తొక్కుతారా అన్నది జనానికి పెద్ద డౌట్. అంతే కాదు గెలిచినా కూడా హైదరాబాద్ టు  డిల్లీ రూట్ పడతారని భయం కూడా.


దానికి బదులు అన్నట్లుగా మాజీ జేడీ పెద్ద హామీయే ఇచ్చేశారు. తాను గెలిస్తే విశాఖలోనే నివాసం ఉంటానని, ప్రజలకు అందుబాటులోనే ఉంటానని అంటున్నారు. ఈ విషయంపై బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తానంటూ భారే  స్టేట్మెంట్ ఇచ్చేశారు. తనను కొత్వాల్ పని చేయమని పవన్ ఆదేశించారని, అందుకే ఇక్కడ పోటీకి వచ్చానని చెప్పుకున్నారు. మొత్తానికి బాండ్ పేపర్,  కొత్వాల్  కధ పక్కన పెడితే ప్రజాస్వామ్యం, చైతన్యం అంటూ నిత్యం నీతులు వల్లించే ఈ మాజీ పోలీస్ అధికారి విశాఖలో నాన్ లోకల్ గా పోటీ చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారో మాత్రం చెప్పలేకపోతున్నారు. అందరూ నన్ను నాన్ లోకల్ అంటున్నారు అని వాపోతున్నారే కానీ విశాఖ లోకల్ పాలిటిక్స్ మీద పెత్తనం చేస్తున్నానని ఎందుకు అనుకోరని కూడా జనం నిగ్గదీస్తున్నారు. మొత్తానికి మన మాజీ జేడీకి కూడా పొలిటికల్ వాసనలు బాగానే వచ్చేశాయి. అందుకే భారీ స్టేట్మెంట్స్ అలా నోటి వెంట వచ్చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: