రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముగ్గురు నేతలు.  ఈ సారి విజయం సాధించి మరోసారి సీఎం చైర్ ఎక్కుతాననే చంద్రబాబు ధీమాతో ఉండగా..నాలుగేళ్ల పాలనలో ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం కోల్పోయిందని..ప్రజలు ఈసారి తమవైపే ఉన్నారని వైఎస్ జగన్ అంటున్నారు.  ఇక టీడీపీ, వైసీపీ దొందూ దొందే అని..రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని..టీడీపీ ప్రత్యేక హోదా విషయాన్ని తుంగలో తొక్కిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అంటున్నారు.  ఇదిలా ఉంటే నిన్న ఈ ముగ్గురు నేతలు నామినేషన్లు సమర్పించిన విషయం తెలిసిందే.  


కడప జిల్లా పులివెందులలో  శుక్రవారం నామినేషన్ వేసిన వైసీపీ అధినేత జగన్ తనపై ఉన్న కేసులు, వాటి దర్యాప్తు వివరాలను వాటిలో వెల్లడించారు. మొత్తం 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు, పోలీస్ స్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.  కాకపోతే ఈ కేసుల్లో చాలా వరకు విచారణలోకి తీసుకోనేలేదు. తనపై  అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు వివరించారు.  కాగా, నామినేషన్ పత్రాల్లో జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయనపై మొత్తం 31 కేసులు నమోదయ్యాయి.


ఆక ఆస్తుల వివరాలు : 
స్థూల ఆస్తుల విలువ రూ.339.89 కోట్లు
జగన్‌ చేతిలో ఉన్న నగదు రూ.43,560
వైఎస్ భారతి చేతిలో ఉన్న నగదు రూ.49,390


బ్యాంకుల్లో డిపాజిట్లు, పెట్టుబడులు: జగన్‌కు బెంగళూరులోని ఓరియంటల్‌ బ్యాంకుఆఫ్‌ కామర్స్‌లో రూ.20,20,083, మరో ఖాతాలో రూ.1,25,32,855, హైదరాబాద్‌ సచివాలయం ఎస్‌బీఐలో రూ.21,44,746, మల్కాజిగిరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.25వేలు ఉన్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓబీసీ బ్యాంకులో రూ.8.09,884, పులివెందుల ఎస్‌బీఐలో రూ.21,37,480 ఉన్నట్లు చూపించారు. యాక్సిస్‌ బ్యాంకు ట్రావెల్‌ కార్డు కింద రూ.1,09.500గా పేర్కొన్నారు.వైఎస్ భారతికి బెంగళూరు బసవేశ్వరనగర్‌లోని యాక్సిస్‌ బ్యాంకు ఖాతాలో రూ.9,69,686, మరో ఖాతాలో రూ.17,41,087. కోరమంగళలోని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో రూ.5,73,701, మరో ఖాతాలో రూ.20,90,821 ఉన్నట్టు వెల్లడి.  

జగన్, భారతి పెట్టుబడులు:
జగన్‌కు భారతి సిమెంట్స్‌తో సహా 13 కంపెనీల్లో పెట్టుబడులు, ఈక్విటీ షేర్లు మొత్తం ఉన్నాయి.. వీటి విలువ రూ.317,45,99,618గా పేర్కొన్నారు. భారతికి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్లు రూ.62,35,01,849 ఉన్నట్లు చూపారు. 2007లో బీఎండబ్ల్యూ ఎక్స్‌5, 2009లో మూడు స్కార్పియోలు రిజిస్ట్రేషన్‌ అయినట్లు చూపారు. ఈ నాలుగు వాహనాల కొనుగోలుకు తాను ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని, తన పేరుతో రిజిస్ట్రేషన్‌ మాత్రమే అయిందని వివరించారు. స్థిరాస్తుల విషయంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌, బెంగళూరులోని ఇళ్లకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు. ఇటీవలే గుంటూరు జిల్లా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన ఇంటికి సంబంధించిన వివరాలను మాత్రం అఫిడవిట్‌లో తెలిపారు.

బంజారాహిల్స్‌ రోడ్‌నెం.2లో రూ.14,46,33,560 విలువ వాణిజ్య భవనం ఉండగా, సాగర్‌సొసైటీలో, పులివెందుల మండలంలోని భాకరాపురంలో రూ.11,99,59,582 విలువ నివాసిత భవనాలు రెండు ఉన్నట్టు చూపించారు.   జగన్‌ పేరిట ఇడుపులపాయలో రూ.42.44లక్షల విలువ 42.44 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయేతర భూమి కింద పులివెందుల మండలం భాకరాపురంలో రెండు వేర్వేరు సర్వేనెంబర్లలో రూ.8,42,39,232 విలువ 4,51,282 చదరపు గజాల స్థలం చూపించారు. 


పులివెందుల, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో రూ.10,25,45,015 విలువైన వాణిజ్య భవనాలున్నాయి. వైఎస్‌ భారతి పేరుతో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో తొమ్మిదెకరాలు, ఉడిపి జిల్లాలో 37సెంట్లు, పులివెందుల మండలంలోనే మొత్తం 10 చోట్ల రూ.7,17,41,262 విలువైన వ్యవసాయేతర భూమి.పులివెందులలో నివాసగృహంతోపాటు గుంటూరు జిల్లా తాడేపల్లిలో రూ.13,89,51,648 మార్కెట్‌ విలువజేసే రెండు విల్లాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: