గతానికి భిన్నంగా ఈ సారి ప్రకాశం జిల్లా దర్శిలో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఎప్పుడు ఇక్కడ టీడీపీ కమ్మ లేక కాపు సామాజికవర్గం అభ్యర్థులను రంగంలోకి దింపుతూ ఉండేది. కాంగ్రెస్‌ ఆ తర్వాత వచ్చిన వైసీపీ రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులను రంగంలోకి దించేవి. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం ఆర్య వైశ్య సామాజికవర్గానికి చెందిన శిద్దా రాఘవరావును రంగంలోకి దించి విజయం సాధించింది. వైసీపీ నుండి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఓడిపోయారు.  అనూహ్య పరిణామాల మధ్వ ఈ పర్యాయం వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన మద్ధిశెట్టి వేణుగోపాల్‌ను రంగంలోకి తెచ్చింది. అటు పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ కూడా కాపు సామాజికవర్గానికే చెందిన కదిరి బాబూరావును రంగంలోకి తీసుకురావడంతో పోటీ రసవత్తరంగా మారింది.   


శిద్ధాని ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలపడంతో కదిరిని ఇక్కడకి తీసుకొచ్చారు. ఇక కదిరి ప్రాతినిధ్యం వహించే కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డిని పోటీ చేయిస్తున్నారు. అయితే దర్శిలో తెదేపా బలంగానే ఉంది. పైగా కదిరి 2004లో దర్శి నుండి తెదేపా తరుపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో దర్శిపై కదిరికి మంచి పట్టు కూడా ఉంది. అలాగే శిద్ధా వర్గం కూడా ఆయనకి మద్ధతుగా నిలుస్తున్నారు. ఇక గత అయిదేళ్లలో మంత్రిగా ఉన్న శిద్ధా దర్శిని అభివృద్ధి బాట పట్టించారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై కొంత సానుకూలత ఉంది. ఇది కదిరికి ప్లస్ అవుతుంది.అటు వైకాపా కూడా ఇక్కడ అంతే బలంగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బూచేపల్లిని పక్కనబెట్టి జగన్ మద్ధిశెట్టి వేణుగోపాల్‌కి టికెట్ ఇచ్చింది. కాపు సామాజికవర్గంలో పట్టు ఉన్న వేణు పోటీ ఉండటం వైకాపాకి ప్లస్ అవుతుంది. 


వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట వలన కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక బూచేపల్లి కుటుంబసభ్యులు రంగంలో లేకపోవడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతున్నది. అయితే జనసేన కూడా ఇక్కడ కాపు సామాజిక వర్గ అభ్యర్థిని రంగంలోకి తీసుకురావడంతో త్రిముఖ పోరుని తెరపైకి తెచ్చింది. బొటుకు రమేష్‌కు టిక్కెట్ కేటాయిస్తూ రేసులో నిలిపింది. ఈ సారి ఎన్నికలలో రెడ్లు, ఎస్సీలు, కమ్మ, కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. ముగ్గురు కాపు నేతలే కావడంతో ఓట్లు షేర్ చేసుకోవచ్చు. రెడ్లు ఎక్కువ శాతం వైకాపాకి మద్ధతు ఉండగా...కమ్మ, వైశ్య తెదేపా వైపు ఉన్నారు. ఎస్సీలు తెదేపా, వైకాపాలకీ సమానంగా ఉన్నారు. అయితే దర్శిలో ఈ రెండు పార్టీలకి గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి. మరి చూడాలి ఎన్నికల సమయంలో ఓటర్లు ఎవరి వైపు ఉంటారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: