రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. గత ఎన్నికలలో కేశినేని నాని టీడీపీ తరఫున పోటీ చేయగా... వైసీపీ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ బరిలోకి దిగారు. అయితే దాదాపు 75వేల మెజార్టీతో వన్ సైడ్‌గా టీడీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయనకే టీడీపీ టికెట్‌ను ఖరారు చేసింది.గత ఎన్నికల్లో పరాజయం పాలయిన వైసీపీ.. ఈసారి వ్యూహాత్మకంగా విజయవాడలో బలమైన అభ్యర్ధిని నిలిపింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌కి వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో విజయవాడలో హోరాహోరీ పోరు ఖాయమైంది.


ఇక తెదేపా అధికారంలోకి వచ్చాక విజయవాడలో జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. పైగా రాజధాని అమరావతి దగ్గరగా ఉండటంతో విజయవాడలో అభివృద్ధి పరుగులు తీసింది. అటు కనకదుర్గ ఫ్లైఓవర్‌ కార్యరూపం దాల్చింది. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ డిసెంబర్‌ నాటికి పూర్తి కానున్నది. అలాగే మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తుండడంతో జిల్లాలోని గ్రామాల దశ తిరిగింది. ఇక పట్టిసీమ డెల్టా రైతులను ఆదుకుంటోంది. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్ధాయి గల ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చెందుతోంది. ఇవన్నీ తెదేపాకి ప్లస్ కానున్నాయి. విజయవాడకు సంబంధించిన పనులని చేయించడంలో నాని ముందున్నారు.  బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను రమేష్‌ ఆస్పత్రి వరకు పొడిగించడంలో నాని పాత్ర ఎంతోవుంది. పనులు చేయించడంలో ప్రదర్శించే నాని దూకుడు ఒకోసారి మైనస్ కూడా అయింది. ఇక ఎలాగో నాని ఆర్ధిక స్థితి గురించి చెప్పుకో అక్కర్లేదు. 


అదే సమయంలో వైకాపా కూడా ఇక్కడ బలపడింది. పైగా ఆర్ధికంగా బలంగా ఉన్న పి‌వి‌పి నానికి ధీటైనా అభ్యర్ధి. జగన్ పాదయాత్ర తర్వాత పార్టీ పరిస్తితి మెరుగైంది. ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకత వైకాపాకి ప్లస్ కానుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 చోట్ల తెదేపా, వైకాపా అభ్యర్ధులు హోరాహోరీగా పోరాడనున్నారు.  వీటిల్లో ఈస్ట్, సెంట్రల్, నందిగామలో తెదేపాకి కొంత అనుకూలత ఉండగా..తిరువూరు, జగ్గయ్యపేట, వెస్ట్‌ల్లో వైకాపాకి కొంచెం ఎడ్జ్ కనబడుతుంది, ఇక మైలవరంలో హోరాహోరీ ఉంది.


పార్లమెంట్‌ నియోజకవర్గం మొత్తంగా చూస్తే ప్రధానంగా ఎస్సీ ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. దాదాపు వీరే 2.60 లక్షల మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత బీసీలు 2.20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత కమ్మ, మైనారిటీ, కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.  వీళ్ళు వరుసగా 2, 1,30, 1,20 లక్షలు ఉన్నారు. అలాగే వైశ్యులు, బ్రాహ్మణులు, ఎస్టీలు, రెడ్లు మొత్తం కలిపి 2.70 లక్షలు ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో మిగిలిన కులాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పార్లమెంట్‌లో నానికే విజయావకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ వైకాపా అభ్యర్ధిగా పి‌వి‌పి ఉండటం వలన టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అయితే జనసేనకి గెలిచే అంతా సత్తా లేకపోయిన ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇక ఆ చీలిక ప్రభావం ఎవరికి నష్టం తెస్తుందో. మరి చూడాలి ఈ సారి రాజకీయ రాజధానిని ఎవరు కైవసం చేసుకుంటారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: