గత మూడు పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో నరసరావుపేటలో ఓటమి మూటగట్టుకుంటున్న తెదేపా...ఈసారి ఎలా అయిన పాగా వేయాలనే కృతనిశ్చయంతో ఉంది. 1985, 1989, 1994, 1999లలో వరుసగా తెదేపా తరుపున కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుండి విజయం సాధించారు. కానీ 2004, 09లలో ఓడిపోయారు. ఇక 2014లో పొత్తులో భాగంగా కోడెల పక్కనే ఉన్న సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలుపొందారు. ఇక నరసారావుపేటలో బీజేపీ పోటీ చేసి వైకాపా అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయింది.


అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు కోడెల శివ ప్రసాద్‌ నిర్వహించారు. ఆయనకు ఈసారి కూడా సత్తెనపల్లి టికెట్ ఖరారవడంతో.. నరసరావుపేట బరిలో డాక్టర్‌ అరవింద్‌ బాబుని దింపింది.  అరవింద్‌కి నియోజకవర్గంలో మంచి పేరుంది. అలాగే ఇక్కడ తెదేపాకి బలమైన క్యాడర్ ఉంది. కోడెల మద్ధతుదారులు కూడా అరవింద్‌కి సపోర్ట్ చేయనున్నారు. ఆర్ధికంగా కూడా అరవింద్ బలంగానే ఉన్నారు. అయితే గత అయిదేళ్లు తెదేపాకి ఇక్కడ సారైనా ప్రాతినిధ్యం లేకపోవడం మైనస్.


అటు వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్ పాదయాత్రలాంటి అంశాలు వైకాపాకి ప్లస్. వైసీపీలోనూ అసమ్మతి గళం వినిపిస్తోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కాపువర్గం పని చేస్తోంది. ఇది గోపిరెడ్డి విజయంపై ప్రభావం చూపనుంది. ఇక జనసేన పార్టీ నియోజకవర్గ టికెట్‌ను మైనారిటీలకు కేటాయించింది. ఈ ఎన్నికల్లో జనసేన తరపున సయ్యద్ జిలానీ పోటీ చేస్తున్నారు. దీంతో సయ్యద్‌కి కాపు, మైనారిటీ ఓటర్లు మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది.


ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు, రెడ్లు, ముస్లింలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. వీరిలో కమ్మ తెదేపాకి, రెడ్లు వైకాపాకి ఎక్కువ మద్ధతు ఇవ్వనున్నారు. కాపులు తెదేపా, జనసేనకి ఎక్కువ మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీలు, బీసీలు తెదేపా, వైకాపాలకీ సపోర్ట్ చేయొచ్చు. ముస్లింలు జనసేన వైపు వెళ్లొచ్చు. అయితే ఈసారి నరసరావుపేటలో టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: