ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సంచ‌ల‌న విష‌యాలు వెల్లడించారు. సచివాలయంలోగల రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాల‌పై వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఓటర్ల తొలగింపునకు నిర్దేశించిన ఫారమ్‌-7 ద్వారా 10 లక్షల దరఖాస్తులు దాఖలు కావడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అందిన మొత్తం దరఖాస్తులను పరిశీలిస్తే వాటిలో మొత్తం 85 శాతం నకిలీ దరఖాస్తులే అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇటువంటి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హోదాలో కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంక్ర మించిన అధికారాలకు లోబడి తానే స్వయంగా సంబంధిత నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయనున్నట్లు ద్వివేది వెల్లడించారు.


ఓట్లను తొలగించాలంటూ మొత్తం 9.5 లక్షల దరఖాస్తులు అందా యని, వాటిలో ఇప్పటికే రెండుచోట్ల ఓట్లు ఉన్న వారిని, మరణించిన వారివి మొత్తం 1.41 లక్షల మంది ఉన్నట్లు గుర్తించి, వారి పేర్లను తొలగించామని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అలాగే జిల్లాల వారీగా ఉన్న నకిలీ ఓట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శ్రీకాకుళం-2579, విజయనగరం-5166, విశాఖపట్నం-2407, పశ్చిమగోదావరి- 8669, తూర్పుగోదావరి-24,190, కృష్ణా-19,774, గుంటూరు- 35,063, ప్రకాశం-6040, నెల్లూరు-3850, కర్నూలు-7684, అనం తపురం,6516, కడప-5292, చిత్తూరు జిల్లాలో 14,052 మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.


స్వ‌యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్ల‌డించిన ఈ వివ‌రాల ప్ర‌కారం భారీగా న‌కిలీ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన నేప‌థ్యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం సంతోష‌క‌రం. అయితే, ఈ న‌కిలీ ద‌ర‌ఖాస్తుల వెనుక మెజార్టీ ప్ర‌తిప‌క్ష వైసీపీని ఇర‌కాటంలో పెట్టేందుకేన‌ని అంటున్నారు. వైసీపీ మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌ను తొల‌గించుకోవ‌డంలో భాగంగా ఈ కుట్ర ప‌న్నార‌ని ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఓటు తొల‌గించాల‌ని వ‌చ్చిన ద‌ర‌ఖాస్తు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: