ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు అధికార తెలుగుదేశం పార్టీకి పెద్ద స‌వాల్ అనే సంగ‌తి తెలిసిందే. హోరాహోరీ పోరు నేప‌థ్యంలో ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వీట‌న్నింటికీ రూపం ఇస్తూ టీడీపీ ఎన్నికల వరాల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ఆర్థికమంత్రి యనమల నేతృత్వంలో రూపొందించిన మేని ఫెస్టోకు అధినేత చంద్రబాబు తుది మెరుగులు దిద్దుతున్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ మేనిఫెస్టోను ఒకటి రెండు రోజుల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. 


ఎన్నిక‌ల్లో ఓట్లు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ మేనిఫెస్టోలో ప‌లు అంశాల‌ను రూపొందిస్తున్నార‌ని తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, గత ఐదేళ్ళలో అమలు చేసిన సంక్షేమ పథకా లతోపాటు రానున్న మరో ఐదేళ్ళకు సంబంధించిన ప్రణాళికలను పొందు పరిచారు. ప్రధానంగా రైతులు, యువత , మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారు. రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 9గంటల ఉచిత విద్యుత్‌ ను 12గంటలకు పెంచుతామని నిర్దిష్టమైన హామీని మేనిఫెస్టోలో పొందుపరిచనున్నారు. అదే విధంగా సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని మరో ఐదేళ్ళపాటు పొడిగించేందుకు నిర్ణయించారు. మరోవైపు ధరల పతనం, దళారుల జోక్యాన్ని నివారించేందుకు రూ. 5వేల కోట్లతో ప్రత్యేకంగా ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను పూర్తి స్ధాయిలో అమలు చేస్తామని స్పష్టమైన హామీని ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ను తీర్చిదిద్దుతామని , దీని కోసం 2019 నాటికి పోలవరంను పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన‌నుంది. పంచ నదులను అనుసంధానం చేసి, రాష్ట్రంలో కరువును పూర్తి స్ధాయిలో తరిమి కొడతామని మేనిఫెస్టోలో స్పష్టమైన హామీని తెదేపా ఇవ్వ‌నుంది. 


సామాజిక భద్రత పథకంలో భాగంగా 65ఏళ్ళు నిండిన వృద్ధులకు ఇస్తున్న పింఛన్‌ లను 10రెట్లు ఇప్పటికే పెంచామని , ఈ వయోపరిమితిని 55ఏళ్లకు తగ్గిస్తామన్న హామీని తెదేపా ఇచ్చింది. అదే విధంగా చంద్రన్న భీమా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ. 5లక్షల పరిహారాన్ని రూ. 10లక్షలకు పెంచుతామని స్పష్టం చేస్తూ మేనిఫేస్టోలో పొందుపరిచారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ. 15వేల ఆదాయాన్ని వచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొంది. యువతను కూడా ఆకర్షించేందుకు వారి కోసం వినూత్న పధకాలను ప్రవేశపెడతామని, ప్రస్తుతం నాలుగులక్షల మందికి అందిస్తున్న నిరుద్యోగ భృతిని 10లక్షలకు పెంచడంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న భృతిని రెట్టింపు చేస్తామని మ్యానిఫేస్టోలో పేర్కొననున్నారు. యువతకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడమే కాక చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఆర్ధిక సాయంతో పాటు రుణాలు ఇస్తామని స్పష్టంగా పేర్కొంది. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి గడిచిన అయిదేళ్లలో రెండు విడతలుగా రూ. 20వేల ఆర్ధిక సాయాన్ని పసుపు , కుంకుమ ద్వారా అందించిన తెదేపా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రతీ ఏటా కొనసాగిస్తామని రూ. 10వేలు చెల్లిస్తామని పేర్కొనడం విశేషం. చంద్రన్న పెళ్లి కానుకలో కూడా మార్పులు తెచ్చి అన్ని వర్గాలకు రూ. 50వేల నుంచి లక్ష వరకు చెల్లిస్తామని తెదేపా హామీ ఇవ్వ‌నుంది. పేదలకు ఆహార భద్రతలతో భాగంగా ప్రస్తుతం ఉన్న అన్న క్యాంటీన్‌ లతో పాటు మరో వెయ్యి క్యాంటీన్‌ లను ఏర్పాటు చేస్తామని హామీఇవ్వ‌నుంది.

కులాల వారీగా ఓట్ల లెక్క‌ల‌ను సైతం టీడీపీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటోంది. బీసీ సబ్‌ ప్లాన్‌ చట్టబద్ధతకు సంబంధించి పకడ్బందీగా విధివిధానాలు రూపొందించి అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెదేపా స్పష్టం చేయ‌నుంది. ఇప్పటికే ఈబీసీ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించామని , రానున్న అయిదేళ్లలో ఈ సామాజిక వర్గ అభ్యున్నతికి రూ. 6వేల కోట్లు కేటాయించనున్నట్లు మ్యానిఫెస్టోలో తెదేపా పేర్కొంది.ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ ను రెండుగా విభజించి మాదిగలకు ప్రత్యేకమైన కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు మ్యానిఫేస్టో ద్వారా తెదేపా ప్రకటన చేయనుంది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు 20లక్షల ఇళ్లను నిర్మిస్తామని ఇక నిర్దిష్టమైన హామీని తెదేపా ఇవ్వనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: