సుప్ర‌సిద్ధ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబు నిరసన బాట మ‌రో మ‌లుపు తిరుగుతోంది. తమ విద్యాసంస్థకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పది వేల మంది విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు నిరసన ర్యాలీ చేపట్టిన సంగ‌తి తెలిసిందే. తిరుప‌తి లీలామహల్‌ సర్కిల్‌ నుంచి గాంధీ రోడ్డు వరకూ భారీ ర్యాలీ నిర్వహించి సంచ‌ల‌నం సృష్టించారు. అంతకముందు.. మోహన్‌బాబు నిరసనకు దిగనున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈక్రమంలో మోహన్‌బాబు తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. అయితే దీనిపై టీడీపీ ఘాటుగా స్పందించింది. ఆయ‌న ఉద్దేశ‌పూర్వకంగా ఆందోళ‌న చేస్తున్నార‌ని మండిప‌డింది.
తాజాగా, ఈ ఎపిసోడ్‌పై మోహ‌న్‌బాబు స్పందించారు.  సీఎంపై ట్విటర్‌ వేదికగా మండిపడుతూ బహిరంగ లేఖ రాశారు. తన కుటుంబంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారని  నటుడు మోహన్‌బాబు అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి అడిగితే చెప్పే ధైర్యం లేక జోకర్ల చేత మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనీటైం.. ఎనీ ప్లేస్‌.. చంద్రబాబు నేరుగా తనతో చర్చకు రావాలని సూచించారు. తన జీవితం తెరచిన పుస్తకమని.. అందులోని ప్రతి పేజీ, ప్రతి పేరా, ప్రతి వాక్యం, ప్రతి అక్షరమూ ఎవ్వరైనా చదువుకోవచ్చన్నారు. తనకు, తన కుటుంబానికి, తన విద్యాసంస్థలకు ఏమి జరిగినా దానికి కారణం అని మోహన్‌బాబు అన్నారు.
చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే నేరుగా త‌న‌తో చ‌ర్చ‌కు రావాల‌ని మోహ‌న్‌బాబు స‌వాల్ విసిరారు. ``నా జీవితం తెరచిన పుస్తకం. నీది అవినీతి చరిత్ర. ఎనీటైం.. ఎనీ ప్లేస్‌.. నువ్వే నేరుగా నాతో చర్చకు రా.. నిజానికి నా స్థాయికి నువ్వు తగవు. మాకు వచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి. నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలు చెప్పగలవా? 2013 సంవత్సరంలో అధికారంలో లేని చంద్రబాబును నా విద్యాసంస్థలకు తీసుకొచ్చాను. నా ఫంక్షన్స్‌, సినిమా ఓపనింగ్స్‌ ఎన్ని జరిగాయో అన్నింటిలోనూ ఆయన ఉన్నారు. కావాలంటే ఇంటర్నెట్‌లో చూసుకోండి. ట్విటర్‌, యూట్యూబుల్లో అవి వసూలు చేశావ్‌.. ఇవి వసూల్‌ చేశావ్‌ అంటూ నీ తరఫున కొంతమంది వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన వసూళ్ల గురించి కూడా వాళ్లను చెప్పమను. మాకు ఇచ్చిన విరాళాలకు లెక్కలున్నాయి. మరి నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలున్నాయా? నీ అడుగులకు మడుగులొత్తితే సైలెంట్‌గా ఉంటావ్‌. లేకపోతే లేనిదానిని ఉన్నట్టుగా అపనిందలు వేయిస్తావా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పదవులు ఉంటాయి పోతాయి. అన్న ఎన్టీఆర్‌కు ఏమీ చేశావో అవన్నీ చెబితే బాగుండదు. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చెయ్యగలవు. అది నన్ను చంపించడం అంతే. అంతకంటే ఏమీ చెయ్యలేవు. `` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: