నూజివీడు. ఈ పేరు చెప్ప‌గానే చ‌టుక్కున గుర్తుకు వ‌చ్చేది మామిడి పండ్లే!! అయితే, ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెల‌కొన్న ఎన్నిక‌ల జోరులో నూజివీడు పేరు చెప్ప‌గానే గ‌తానికి భిన్నంగా ఇక్క‌డ ఇప్పుడు జ‌రుగుతున్న ర‌స‌వ‌త్త‌ర ఎన్నిక‌ల‌ పోరు గుర్తుకు వ‌స్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల మ‌ధ్య పోరు జోరుగా సాగుతోంది. ఇద్ద‌రికీ కూడా ప్ర‌జ‌ల నుంచి పూర్తి మ‌ద్ద‌తు, పార్టీ ల ప‌రంగా సంపూర్ణ స‌హ‌కారం, ఆర్థికంగా బ‌లం వంటివి బాగా క‌లిసి వ‌స్తున్నాయి. దీంతో జిల్లాలోనే నూజివీడు ఫైట్ ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. నూజివీడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 1989 ఎన్నిక‌ల నుంచి ప‌రిశీలిస్తే.. మూడు సార్లు ఇక్కడ టీడీపీ విజ‌యం సాధించింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ పాగా వేయ‌గా.. కాంగ్రెస్ రెండు సార్లు విజ‌యం సాధించింది. 


గ‌త ఎన్నిక‌ల్లో గెలుపొందిన మేకా ప్ర‌తాప్ అప్పారావు.. గ‌తంలోనూ కాంగ్రెస్ టికెట్‌పై 2004లో గెలుపొందారు. ఇక‌, 2014లో వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఆయ‌నే వైసీపీ టికెట్‌పై పోరుబ‌రిలో దిగారు. ఇక‌, ఇక్క‌డ టీడీపీ గ‌త ఎన్నిక‌ల‌లో ఓట‌మి పాలైన ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌రావుకే టికెట్ ఇచ్చింది. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వేసిన ఎత్తుతో ఇక్క‌డ టీడీపీ జోరు పెరిగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ముద్ద‌ర‌బోయిన పై సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. కేవ‌లం 10వేల ఓట్ల తేడాతోనే ఆయ‌న విజ‌యానికి దూర‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. వివాదాల‌కు దూరంగా ప్ర‌జ‌ల‌తోనే ఉండడం ఇక్క‌డ ముద్ద‌ర‌బోయిన‌కు క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన అంశం. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు కూడా ఇక్క‌డ దూసుకుపోతున్నాయి.


ఇక‌, నూజివీడును కార్పొరేష‌న్‌గా గుర్తించే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్ట‌డంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు టీడీపీ జ‌పం చేస్తున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మేకా ప్ర‌తాప్ అప్పారావుపై వ్య‌తిరేక‌త లేక‌పోయినా.. అభివృద్ధి చేయ‌లేక‌పోయాడ‌నే అసంతృప్తి ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం నుంచి నిధులు తేవ‌డం, స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డం వంటివి లేక‌పోవ‌డంతో ఇక్క‌డ ప్ర‌జ‌లు నిరాశ‌లో ఉన్నారు. ఇక‌, ప్ర‌పంచ‌స్థాయిలో మామిడి ఎగుమ‌తి జ‌రిగే ఈ ప్రాంతంలో మామిడి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కేవ‌లం ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమితం కావ‌డంపైనా రైతాంగం నిట్టూరుస్తోంది. భూగ‌ర్భ డ్రైనేజీ ప్ర‌తిపాద‌న కూడా ఆదిలోనే అంత‌రించిపోయింది. దీంతో అధికారంలోకి వ‌చ్చే పార్టీకే ఓటువేయాల‌నే నినాదం వినిపిస్తోంది. ఈ ప‌రిణామాలు టీడీపీకి క‌లిసి వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: