తెలుగు నాట రాజకీయాలను ఓ మలుపు తిప్పిన నాయకునిగా నందమూరి తారక రామారావుని చెప్పుకోవాలి. అప్పటివరకూ ప్రచారం అంటే ఎవరికీ తెలియదు. జనాల వద్దకు నాయకులు వచ్చే పరిస్థితి పెద్దగా లేదు. అలాంటిది అలుపెరగకుండా సుడి గాలి పర్యటనలు చేస్తూ తొమ్మిది నెలల పాటు అవిశ్రాంతగా జనంలోనే ఉంటూ అన్న గారు జనం మనసు దోచుకున్నారు. 1983 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు.


ఇక అదే ఒరవడిని  తరువాత రోజుల్లో చాలా మంది నాయకులు పాటించాలనుకున్న అది కుదరలేదు. ఎందుకంటే అన్న గారి మాదిరిగా కఠోర దీక్ష పట్టుదల, అలుపుకు వెరవని తత్వం లేకపోవడమే అందుకు కారణం. ఇక జగన్ విషయానికి వస్తే అదే పట్టుదల, మొండితనం చాలా ఎక్కువగా  కనిపిస్తుంది. జగన్ సైతం జనాల్లోనే గత తొమ్మిదేళ్ళుగా గడుపుతూ వచ్చారు. గెలుపు, ఓటములు పక్కన పెడితే జగన్ ప్రజల మధ్యనే గడిపారు. సుదీర్ఘమైన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జగన్ కే చెల్లిందని కూడా అంటారు.


ఇక జగన్ కి, అన్న గారికి ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇద్దరు జనం మధ్యనే ఉంటారు. ఇద్దరూ జనాన్నే నమ్ముతారు. ఇద్దరూ వారిని అండగా చూసుకునే రాజకీయాలు చేస్తారు. నాయకుల కంటే జనాన్ని నమ్మాలన్న సిధ్ధాంతం అన్న గారిది. అదే జగన్ లోనూ కనిపిస్తుంది. నాడు రెండు సార్లు వెన్నుపోటుకు గురి అయి ఆధికారం కోల్పోయినా అన్న గారు డీలా పడలేదు. మళ్ళీ జనమే గెలిపిస్తారంటూ వారి వద్దకే వెళ్ళారు. జగన్ సైతం 23 మంది ఎమ్మెల్యేలను, నలుగురు ఎంపీలను టీడీపీ లాక్కున్నా కూడా మొక్కవోని ధైర్యంలో జనంలోనే తేల్చుకుంటున్నారు. మరి అన్న గారి అలుపెరగని పోరాటానికి జనం భారీ ఫలితాలనే ఇచ్చారు. జగన్ చేస్తున్న అప్రతిహతమైన కార్యసాధనకు జనం ఎలాంటి ఫలితం ఇస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: