భాషను బట్టి మనిషికి గౌరవం వస్తుంది. సంస్కారం కూడా తెలుస్తుంది. అయితే మన రాజకీయాల్లో వాడుతున్న భాష రోజురోజుకూ దిగజారిపోతోంది. ఒకనాడు రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు  ప్రత్యర్ధులుగా చూసే  వారు.  గౌరవించుకునేవారు. ఇపుడు శత్రువు కంటే ఘోరంగా చూస్తున్నారు. నిందిస్తున్నారు. . తిట్ల పురాణం లంకించుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు.


ఏపీలో ఇపుడు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అంటున్న బాబు నుంచి నిన్న రాజకీయాల్లోకి వచ్చిన పవన్ వంటి వారు వాడుతున్న భాష చాలా దారుణంగా ఉంటోందని కామెంట్స్ వస్తున్నాయి. చంద్రబాబు ప్రత్యర్ధి పార్టీలను రౌడీలు, గూండాలు అనడం ద్వారా మొత్తం రాజకీయ వ్యవస్థ మీదనే జనాలకు నమ్మకం పోయేలా చేస్తున్నారు. తోకలు కట్ చేస్తామంటూ, సమాధి కట్టేస్తామంటూ  బాబు బెదిరింపు మాటలు కూడా బాధాకరమే. ఎవరి తోక అయినా కట్ చేయాల్సింది ప్రజాస్వామ్యంలో ప్రభువులు అయిన ప్రజలే. వారి తీర్పే అందరికీ శిరోధార్యం కావాలి.


ఇక ఎన్నికల ప్రచారంలో తమ గురించి చెప్పుకోవడానికి సమయం వెచ్చించ‌కుండా ఇతర పార్టీలను నిందించడం దారుణమే. జగన్ ఏపీకి చెడ పుట్టాడంటూ బాబు చేసిన ఓ మాట దారుణాతి దారుణం. ఓట్ల కోసం ఇంతలా రెచ్చిపోవాలా అనిపించక మానదు. ఇక నిన్న రాజకీయాల్లోకి వచ్చిన పవన్ సైతం మాటకు వస్తే చాలు తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నారు. ఇది. ఏ రకమైన భాషో ఆయనే చెప్పాలి. సినిమా డైలాగుల వరకూ బాగానే ఉంటాయి కానీ జనంలో ఉన్నపుడు తగిన భాష వాడాలని పవన్ గుర్తించడం మంచిదేమో.


అదే విధంగా అప్పట్లో జగన్ సైతం దారుణంగా మాటలు వాడారు. నడి రోడ్డు మీద సీఎం ని కాల్చి చంపమని పిలుపు  ఇచ్చారు. దాని వల్ల గెలిచే నంధ్యాల సీటు కోల్పోయారు. ఆ అనుభవంతో జగన్ ఇపుడు తన భాషను మార్చుకున్నారు. అంటే జనం వీటిని ఇష్టపడడం లేదని స్పష్టంగా తెలిసింది. అయినా ఇదే దారుణమైన భాషను ఉపయోగిస్తే జనం ఇపుడు ఏ రకమైన తీర్పు ఇస్తారో కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా చంపుతాము, నరుకుతాం, తోలు తీస్తాం అన్నవి హింసను ప్రేరేపించే మాటలు. వీటిని ఎన్నికల సంఘం కూడా పరిగణలోకి తీసుకోవాలి


మరింత సమాచారం తెలుసుకోండి: