విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధి షబానా చేసిన పనితో టిడిపికి పెద్ద షాక్ తగిలింది. టికెట్ విషయంలో, పోటీ చేసే విషయంలో చూపిన శ్రద్ధ ఇతరత్రా విషయాల్లో చూపకపోవటంతో ఇపుడు నామినేషనే చెల్లకుండా పోయే పరిస్ధితి ఎదురైంది. దాంతో టిడిపి నేతల్లో ఫుల్లుగా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, నామినేషన్ వేయటానికి మిగిలుంది ఇక అర్ధగంట మాత్రమే. చివరి నిముషంలో చేసిన తప్పు బయటపడటంతో ఏమి చేయాలో చంద్రబాబునాయుడుకు కూడా తోచటం లేదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, బికామ్ లో ఫిజిక్స్ చదివిని ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ గుర్తున్నారు కదా ? ఆయన కూతునే షబానా ఖాతూన్. మొన్నటి వరకూ అమెరికాలో ఉండేవారు. అమెరికాలో షబానాకు గ్రీన్ కార్డు కూడా ఉంది. కేవలం విజయవాడలో పోటీ  చేసే ఉద్దేశ్యంతోనే షబానా అమెరికా నుండి విజయవాడకు వచ్చారు. ఎంతో ఆర్భాటంగా నామినేషన్ కూడా వేశారు. ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.

 

ఇంతలో ఈరోజు ఉదయం ఎన్నికల కమీషన్ కార్యాలయం నుండి ఓ సమాచారం అందుకుంది. అదేమిటంటే, షబానా నామినేషన్ చెల్లదని. ఎందుకంటే, షబానాకు అమెరికాలో గ్రీన్ కార్డుంది. అంటే వేరే దేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళు దాన్ని రద్దు చేసుకోకుండా మనదేశంలో పోటీ చేయలేరు. షబానా సమస్య అదే. అమెరికాలో గ్రీన్ కార్డు రద్దు చేసుకోకుండానే విజయవాడలో నామినేషన్ వేసింది. నామినేషన్ తిరస్కరణకు ఇపుడా నిబంధనే అడ్డువచ్చింది.

 

నామినేషన్ దాఖలుకు ఈరోజు చివరి రోజన్న విషయం తెలిసిందే. షబానా నామినేషన్ స్ధానంలో మరొకరికి బిఫారం ఇచ్చి నామినేషన్ వేయించే విషయాన్ని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. చివరి నిముషంలో చూసుకోవటంతో ఏం చేయాలో ఎవరికీ తోచటం లేదు. ప్రకాశం జిల్లా పర్చూరులో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు హితేష్ కు కూడా ఇదే సమస్య వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ గ్రీన్ కార్డు రద్దు కాకపోవటంతో చివరికు వెంకటేశ్వరరావే పోటీ చేయాల్సొస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: