సుప్ర‌సిద్ధ నటి జయప్రద త‌న సెకండ్ పొలిటిక‌ల్‌ ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్నారు. ఆమె బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థిపై పోటీ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆమె.. తర్వాత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడదే పార్టీకి చెందిన ఆజంఖాన్‌పై జయప్రద పోటీ చేసే చాన్సుంది. ఆజంఖాన్ యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 


2004 నుంచి 2014 వరకు రాంపూర్‌ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున జయప్రద ఎంపీగా కొనసాగారు. ఈ రాంపూర్ నుంచి 2014లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ నేపాల్ సింగ్ విజయం సాధించారు. ఇప్పుడీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆజంఖాన్‌పై గతంలో ఆమె ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయనను చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తొస్తున్నాడని ఆమె అన్నారు. రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆజమ్ ఖాన్ 9 సార్లు ఎన్నికయ్యారు. ఆజమ్ ఖాన్‌ది సమాజ్‌వాదీ పార్టీ కాగా, జయప్రదది రాష్ట్రీయ్ లోక్‌దళ్. 2009లో జరిగిన ఎన్నికల సమయంలో ఆజమ్ ఖాన్‌పై జయప్రద ఫిర్యాదులు చేసింది. తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఆజమ్ ప్రయత్నిస్తున్నారని ఆమె గతంలో ఆరోపించారు. 


ఎన్నికల సమయంలో మార్ఫింగ్ చేసిన సీడీలను ఆజమ్ ఖాన్ సరఫరా చేశారని జయప్రద ఆరోపించారు. తన నగ్న ఫొటోలంటూ కొన్నింటిని ఓటర్లకు పంచారని, తనపై యాసిడ్‌ దాడికి ఆజమ్‌ ఖాన్‌ ప్రయత్నించారని కూడా జయప్రద ఆరోపించారు. ఇపుడు ఆమె గనుకు బీజేపీలో చేరి రామ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగితే... పోటీ తీవ్రస్థాయిలో ఉండే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: