ఈ సారి ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో తెదేపా నుండి పోటీ చేసి గెలిచిన తోట నరసింహం ఈ సారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.  అనారోగ్య కారణాలతో వలన పోటీ చేయలేనని...తన భార్యకు జగ్గంపేట టికెట్ కావాలని చంద్రబాబుని కోరారు. కానీ జగ్గంపేటలో బలమైన నేత జ్యోతుల నెహ్రూ ఉండటంతో టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో తోట ఫ్యామిలీ వైకాపాలోకి జంప్ అయింది. దీంతో జగన్ తోట భార్య వాణికి పెద్దాపురం టికెట్ ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో తోట మీద వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ ఈ సారి తెదేపా నుంచి కాకినాడ పార్లమెంట్ బరిలో ఉన్నారు. అటు వైకాపా నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు.


తెదేపా నుంచి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్‌కి కాకినాడలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాపు సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. ఇక్కడ తెదేపాకి బలమైన క్యాడర్ ఉంది. అటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సునీల్ గెలుపుకి కొంత సహకరించవచ్చు. అయితే ఈసారి వైకాపా బలపడటం, జనసేన పోటీలో ఉండటం తెదేపా గెలుపు అంత ఈజీ కాదు. అటు కాకినాడలో మంచి పట్టున్నతోట ఫ్యామిలీ తెదేపాని వీడటం మైనస్. ఇక వివిధ రాజకీయ పార్టీలలో కీలక పదవులు చేపట్టి...వైకాపా నుంచి పోటీ చేస్తున్న వంగా గీతాకి కాకినాడ పార్లమెంట్‌లో బాగానే పేరుంది. తోట ఫ్యామిలీ పార్టీలో చేరడం, వైకాపాకి పెరిగిన బలం గీతకి ప్లస్ కానున్నాయి. అయితే కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటనపై కొంత వ్యతిరేకత రాగా, పవన్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా కొంత మైనస్ కానున్నాయి. 


ఇక తెదేపా, వైకాపా అభ్యర్ధులు కాపు సామాజికవర్గం వారే...వీరికి తోడు జనసేన నుంచి పోటీ చేసే జ్యోతుల వెంకటేశ్వరరావు కూడా అదే సామాజిక వర్గం. దీంతో కాపు ఓట్లు చీలే అవకాశం ఉంది. జనసేన పార్టీ ప్రభావం ఆ రెండు పార్టీలలో ఏదొక పార్టీకి నష్టం కలిగించడం ఖాయం. ఇక ఈ పార్లమెంట్ పరిధిలో కాకినాడ సిటీ, రూరల్, తుని, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాకినాడ సిటీ, రూరల్, పెద్దాపురం నియోజకవర్గాల్లో తెదేపా గెలవగా...తుని, ప్రత్తిపాడు, జగ్గంపేటలలో వైకాపా గెలిచింది. పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి గెలిచారు. 


అయితే ఈసారి పిఠాపురం,కాకినాడ సిటీ, రూరల్‌లో త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని, జగ్గంపేటలలో తెదేపా, వైకాపా ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ పార్లమెంట్ పరిధిలో కాపు కులం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. తర్వాత బీసీల్లో శెట్టిబలిజ కులస్తులు ఎక్కువ. ఈ రెండు వర్గాల్లో మెజారిటీ ఓట్లు ఎవరికి వస్తే ఆ అభ్యర్థి గెలుస్తాడు. అయితే కాకినాడ సిటీ, రూరల్‌, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో మత్స్యకార ఓటర్ల ఎక్కువ. మిగిలిన కులాల్లో ఎస్సీలు ఎక్కువ కనిపిస్తారు. కాపులు మూడు పార్టీలకి సమానంగా ఉండగా..ఎస్సీలు వైకాపా వైపు ఎక్కువ ఉన్నారు. శెట్టిబలిజలు తెదేపాకి మొగ్గు చూపుతారు. మొత్తానికి ఈసారి కాకినాడలో త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: