2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన రూరల్‌లో గత రెండు ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైకాపా నేత ఆకుల వీర్రాజుపై విజయం సాధించారు. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరే మళ్ళీ ప్రత్యర్ధులు గా ఉన్నారు. ఇక జనసేన నుంచి కందుల దుర్గేష్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన బుచ్చయ్య రూరల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకి చేరువయ్యేలా చేశారు. ఇక్కడ తెదేపా క్యాడర్ కూడా బలంగా ఉంది. ఇవ బుచ్చయ్యకి ప్లస్ కానున్నాయి. 


అయితే ఈసారి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావడం..నియోజకవర్గంలో కూడా బుచ్చయ్యకి పెద్దగా అనుకూలమైన వాతావరణం లేదు. అదే సమయంలో వైకాపా ఇక్కడ బలపడింది. గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి వీర్రాజుపై ఉంది. ఇక వీర్రాజు కూడా ఈ ఐదేళ్లు వైకాపా బలోపేతానికి బాగా కృషి చేశారు. ప్రజల మధ్యలో ఉన్నారు. జగన్ పాదయాత్ర తర్వాత నియోజకవర్గంలో ఇంకా బలం పెరిగింది. ఇవి ఆకులకి ప్లస్ కానున్నాయి. కానీ జగన్ కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు, జనసేన పోటీలో ఉండటం వలన వైకాపాకి కొంత మైనస్ అవ్వొచ్చు. అలాగే జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఇదివరకు వైకాపాలో ఉన్న కందుల ఎమ్మెల్సీగా, జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన అనుభవం ఉంది. 


ఇక్కడ కాపు ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. ఇవి కందులకి కలిసొస్తాయి. కానీ తెదేపా, వైకాపాలో నుంచి కూడా బలమైన అభ్యర్ధులు, క్యాడర్ ఉండటం జనసేనకి మైనస్. ఈ నియోజకవర్గంలో కడియం, రాజమండ్రి గ్రామీణ మండలాలు పూర్తిగా ఉండగా...రాజమండ్రి పట్టణ, రాజమండ్రి కార్పోరేషన్‌లు పాక్షికంగా ఉన్నాయి. ఇక ఇక్కడ ప్రధానంగా బీసీ సామాజికవర్గం, కాపు సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ ఉన్నారు. వారే గెలుపోటములని ప్రభావితం చేయనున్నారు. అయితే ఇక్కడ ప్రధాన పోరు తెదేపా-వైకాపాల మధ్య జరిగిన జనసేన ఓట్ల చీలిక ప్రభావం వైకాపాకి నష్టం తెచ్చేలా కనిపిస్తోంది. మరి చూడాలి రూరల్‌ని ఈ సారి ఎవరు దక్కించుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: