2014 ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెదేపా సునాయసం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) 24వేల ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్ధి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా వీరిద్ధరే మళ్ళీ బరిలో ఉన్నారు. అయితే ఈసారి తెదేపా విజయం అంత సులువు కాదు. అలా అని వైకాపా విజయం నల్లేరు మీద నడక కూడా కాదు. వీరి గెలుపోటములని జనసేన అభ్యర్ధి నిర్ణయించేలా కనపడుతుంది. జనసేన తరపున ముత్తా శశిధర్ పోటీలో నిలబడ్డారు. వీరు చీల్చే ఓట్లు వలన గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంది.


ఇక గత ఐదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమాడికి...ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్లస్ కానున్నాయి. కానీ వనమాడిపై అటు తెదేపా క్యాడర్‌లోనూ, ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. దీంతో వనమాడి గెలుపు అంత సులువు కాదు. అటు వైకాపాలో సీనియర్ నేతగా ఉంటున్న ద్వారంపూడికి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా ఈ ఐదేళ్లు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి మధ్యలోనే ఉన్నారు. పైగా ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత తదితర అంశాలు ద్వారంపూడికి కలిసిరానున్నాయి.


మరోవైపు జనసేన నుంచి ముత్తా శశిధర్ బరిలో ఉన్నారు. పవన్ ఇమేజ్, కాపుల ఓట్లు ముత్తాకి ప్లస్. 2009లో ప్రజారాజ్యం పార్టీకి 35 వేల ఓట్లు పడ్డాయి. ప్రధాన పోరు తెదేపా-వైకాపా ల మధ్య జరిగిన...జనసేన అభ్యర్ధి ఓట్లు చీల్చే దాని బట్టి వారి గెలుపోటములు డిసైడ్ అవుతాయి. నియోజకవర్గంలో మత్య్సకార వర్గం ఎక్కువగా ఉంది. తర్వాత కాపులు, దళితులు అధికంగా ఉన్నారు. మత్య్సకారులు ఎవరికి ఓటేస్తే వారే ఎమ్మెల్యేగా గెలుస్తారు. అయితే ప్రస్తుత పరిస్తితులని బట్టి చూస్తుంటే ఇక్కడ వైకాపా అభ్యర్ధి ద్వారంపూడికి కొంత ఎడ్జ్ కనపడుతుంది. కానీ ఎన్నికల సమయానికి జనసేన ప్రభావం..ఓటర్లలో ఎలాంటి మార్పు లాంటి అంశాలు గెలుపుని ప్రభావితం చేస్తాయి. మరి చూడాలి ఈ సారి సిటీలో తెదేపా మళ్ళీ పాగా వేస్తుందో లేక వైకాపా జెండా ఎగరవేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: