భీమ‌వ‌రం నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలోకి దిగుతుండడంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. టీడీపీ నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు (అంజిబాబు) మ‌ళ్లీ పోటీ చేస్తుండ‌గా,  వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అయితే టీడీపీకి ఇక్క‌డ షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతుండ‌టంతో ఎన్నిక‌లకు ముందే ఆ పార్టీ ఓట‌మి ఖాయంగా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. గ‌డిచిన కొద్ది రోజులుగా పార్టీలో అస‌మ్మ‌తి జోరుగా వ‌ర్ధిల్లుతోంది. కీల‌క నేత‌లు ఒక్కోక్క‌రు పార్టీని వీడుతుండ‌టం  ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్పాలి. ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడిగా ప‌నిచేస్తున్న తోట భోగ‌య్య పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇక మ‌రో కీల‌క నేత మునిసిప‌ల్ చైర్మ‌న్, యువ‌నేత గోవింద‌రావు కూడా పార్టీ నుంచి నిష్క్రమించ‌డం ఆ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా చెప్పుకోవాలి.


ఇక వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీనివాస్ విష‌యానికి వ‌స్తే గ‌త ఎన్నిక‌ల అనంత‌రం నుంచే ఆయ‌న ప‌క‌డ్బందీగా ఈ ఎన్నిక‌ల కోసం ప్లాన్ చేసుకుంటూ వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. అందుకు అనుగుణంగానే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో సంబంధాలు పెంపొందించుకుంటూ వ‌స్తున్నారు. అలాగే  పార్టీ అధికారంలో లేన‌ప్ప‌టికి సొంతంగా నిధులు ఖ‌ర్చు చేస్తూ ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటూ వ‌స్తున్నారు. శుభ‌కార్యాలు, అశుభ కార్యాల‌కు హాజ‌ర‌వుతూ జ‌నంలో క‌ల‌సిపోతూ క్యాడ‌ర్‌ను నిర్మించుకున్నారు. అదే స‌మ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై  కొంత వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. దీనికి తోడు  పార్టీ నుంచి ఇప్పుడు నేత‌లు నిష్క్ర‌మిస్తుండ‌టంతో ఆయ‌న ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. 


జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో నిల్చోవ‌డంతో స‌హ‌జంగానే ఒక్క‌సారిగా ఆ పార్టీకి ఇక్క‌డ జ‌వ‌స‌త్వాలు వ‌చ్చి చేరాయి. స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న అభిమానులు ఆయ‌న కోసం ప్ర‌చారం మొద‌లెట్టేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఒక్కసారి మాత్ర‌మే అది నామినేష‌న్ వేసిన రోజున ఇక్క‌డ‌కి వ‌చ్చి ప్ర‌సంగించి వెళ్లారు. జ‌న‌సేనాని కోస‌మైతే స్వ‌చ్ఛందంగానే ఓటేసేందుకు వేలాదిమంది సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే అదే స‌మ‌యంలో వైసీపీ నుంచి గ్రంధి బ‌లంగా క‌న‌బ‌డుతున్నాడు. ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామాంజ‌నేయులు పోరు నామ‌మాత్రంగా మారుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక అదే జ‌రిగితే ప‌వ‌న్‌-గ్రంధి మ‌ధ్యే గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని తెలుస్తోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో...?


మరింత సమాచారం తెలుసుకోండి: