ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ టార్గెట్ గా కత్తులు దూస్తోంది. మోదీ దేశానికి సేవకుడు కాదని, లూటీదారుడని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి పేద కుటుంబానికి కనీస ఆదాయ పథకాన్ని వర్తింప జేస్తామని ప్రకటించింది. ఈ పథకం వివరాలను రాహుల్ స్వయంగా ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ తన అస్త్రాన్ని బయటకు తీసింది. దేశంలో నిరుపేదలైన 25 కోట్ల మంది ప్రజలకు వర్తించేలా బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశంలో నిరుపేదలైన 25 కోట్ల మందికి ప్రతి నెలా రూ.6వేల చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. తద్వారా సంవత్సరానికి రూ.72వేల రూపాయల ఆదాయం లభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో విస్తృతంగా దీనిపై చర్చించేగా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. దీని వల్ల దేశంలోని 20శాతం మందికి లబ్ది చేకూరుతుందని రాహుల్ చెప్పారు.

నిరుపేదలకు కనీస ఆదాయం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన ఆర్థిక సాయం అందించడం తమ బాధ్యత అని రాహుల్ అభిప్రాయపడ్డారు. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేయడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. ఈ పథకం ద్వారా పేదరికం లేకుండా పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఈ పథకంపై విస్తృతంగా అధ్యయనం చేసిందని రాహుల్ చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్టు రాహుల్ వివరించారు. మోదీ నియంతృత్వ పాలనలో పేదలకు లబ్ది చేకూరలేదని విమర్శించిన రాహుల్.. ఆయన పూర్తిగా కార్పొరేట్ పక్షానే నిలిచారన్నారు. ఏడాదికి రూ.6వేల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేస్తామంటూ మోదీ ప్రకటించిన స్కీమ్ ను రాహుల్ తప్పుబట్టారు. అది కేవలం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: