తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఏపీలో శుక్రవారం నాటికి అసెంబ్లీకి 1,419, లోక్‌సభకు 199 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 28. 


ఇక ఏపీలో ఓటర్ల జాబితాను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717 అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 11 తర్వాత కొత్తగా 24,12,626 మంది ఓటర్లుగా చేరారు. 1,41,823 ఓటర్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించింది. 


తెలంగాణ విషయానికి వస్తే.. శుక్రవారం నాటికి 220 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం చివరిరోజు నామినేషన్ల స్వీకరణ జరగ్గా ఏకంగా 570 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం నామినేషన్ల సంఖ్య 795కు పెరిగింది. చివరిరోజు ఒక్క నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికే 182 నామినేషన్లు వచ్చాయి. మంగళవారం నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలు కావడంతో అక్కడ ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఇక ప్రచారం జోరందుకోనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: