2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మండపేటలో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధి వేగుళ్ళ జోగేశ్వరరావు విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వేగుళ్ళ 36 వేల భారీ మెజారిటీతో వైకాపా అభ్యర్ధి గిరిజాల స్వామినాయుడుపై విజయం సాధించి మండపేట తెదేపాకి కంచుకోట అని మళ్ళీ రుజువు చేశారు. ఇక ఈసారి కూడా జోగేశ్వరావు పోటీలో ఉండగా...వైకాపా నుంచి జిల్లాలో సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీలో ఉన్నారు. జనసేన నుంచి వేగుళ్లలీలాకృష్ణలో బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు జరగడం ఖాయమైంది.


గత ఐదేళ్లలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందున్నారు. ఇక కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటూ.. అన్నివర్గాలతో సత్సంబధాలు కలిగిఉండటం ఆయనకు కలిసి వస్తోంది. రెండుసార్లు పదేళ్లపాటు ఎమ్మెలేగా పనిచేసిన ఆయన నియోజకవర్గంలో 90శాతం మేర అభివృద్ధి సాధించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అటు పల్లెలను కూడా పట్టణంతో సమానంగా తీర్చిదిద్ది రాష్ట్రస్థాయిలో మండపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. దీంతో ఈ సారి కూడా ఆయన గెలుపు ఖాయమని అంటున్నారు.


అటు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీలో ఉండటం ఆపార్టీకి కలిసొచ్చే అంశం. కానీ  వైసీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ముగ్గురు కో ఆర్డినేటర్లను మార్చి చివరకు పితాని అన్నవరం ఇక్కడ అభ్యర్ధిగా ప్రచారం చేసుకున్న తర్వాత ఆయనను కాదని మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఎంపిక చేయడంతో క్యాడర్‌లో కొంతమేర గందరగోళం నెలకొంది. ప్రస్తుతం బోస్‌ ఇక్కడ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని వెళ్తున్నారు. వైసీపీ కో ఆర్డినేటర్లు వేగుళ్ల పట్టాభిరామయ్య, వేగుళ్లలీలాకృష్ణ, పితాని అన్నవరం పార్టీలో పనిచేసి భారీగా ఖర్చు పెట్టి నష్టపోయారు. ఈ ప్రభావం వైకాపా గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


అటు ఎమ్మెల్యే జోగేశ్వరరావు సామాజికవర్గానికి చెందిన వేగుళ్ళ లీలాకృష్ణ వైసీపీని వీడి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కాపు సామాజికవర్గం, యువతపైనే ఆశలు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలో సుమారు 95వేలు మంది బీసీ, 45 వేల మంది ఎస్సీ, 50వేల మంది ఓసీ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో గెలుపు ఓటములు వారిపైనే ఆధారపడి ఉంటాయి. మొత్తం మీద తెదేపా అభ్యర్ధికే కొంత గెలుపు అవకాశాలు మెరుగుగా కనిపిస్తున్నాయి. కానీ వైకాపా, జనసేన నుంచి గట్టి అభ్యర్ధులు ఉండటం వలన పోటీ టఫ్‌గా వుండనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: