తెలంగాణ  ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతి ఒకింత గ్యాప్ త‌ర్వాత విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్‌ భూస్థాపితం నీ వల్ల కాదు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.  మెదక్‌లోని చిల్డ్రన్స్‌ పార్కులో ఏర్పాటు చేసిన 'కాంగ్రెస్‌ సింహగర్జన' సభలో ఆమె ప్రసంగిస్తూ... 'దొరా.. కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేద్దామని కంకణం కట్టుకున్నావా?..అది నిన్ను సృష్టించిన దేవుడి వల్ల కూడా కాదు. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో నీ అంతు చూడటం ఖాయం. కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసి కొత్త జీవాన్నిచ్చావు' అని ఎంపీ విజయశాంతి వ్యాఖ్యానించారు.


తనకు 16 సీట్లిస్తే పీఎం అయిపోతానంటున్నారని.. 16 సీట్లతో ప్రధాని అవుతారా అంటూ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, మెదక్‌ మాజీ విజ‌య‌శాంతి ఘాటుగా వ్యాఖ్యానించారు. 16సీట్లు గెలిస్తే ప్రధాని అవుతానని చెబుతున్న కేసీఆర్‌కు 'దిమాక్‌ ఉందా' అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు చూస్తుంటే సినిమాలలో బ్రహ్మానందం-అలీ కామెడీ చూసినట్లుందన్నారు.  సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే సీఎం అయ్యేవాడివా దొరా.. మరి అలంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చించి ముమ్మాటికీ సోనియాగాంధే అన్నారు. 'రాష్ట్రం కోసం ఆనాడు నువ్వూ.. నీ కుటుంబం సోనియా కాళ్లు పట్టుకోలేదా?' అని ప్రశ్నించారు. రాష్ట్రం ఇచ్చే దాకా దేవత అయిన ఆమె ఆ తర్వాత దెయ్యం ఎలా అయిందో చెప్పాలన్నారు. వెయ్యిమంది కేసీఆర్‌లు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం లేదన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు.


తాను తెలంగాణ‌ గడ్డ ఆడబిడ్డనని.. గెలిచినా ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని విజ‌య‌శాంతి స్ప‌ష్టం చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్‌ సహకారంతో మెతుకు సీమకు రైల్వేలైన్‌ సాధించానన్నారు. అందుకు ఎక్కని గడప లేదని.. ముగ్గురు ముఖ్యమంత్రులు, ముగ్గురు జీఎంలు, ముగ్గురు రైల్వే మంత్రులను కలిసి పనులు సాధించింది ఈ రాములమ్మే అని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే దొర కొడుకు, కూతురు రాష్ట్రాన్ని దోచుకుంటారని అన్నారు. బీజేపీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి ఆచరించని ముష్టి పార్టీ విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనాన్ని తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీ ఐదేశ్ల‌ పాలన కుంభ కోణాల మయమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: