అధికార తెలుగుదేశంపార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపిల అధినేతలు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకేరకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.  ఇంతకీ ఆ ఇబ్బందేమిటనే కదా మీ అనుమానం ? అదేనండీ ప్రచారం. అవును ప్రచారంలో పై ఇద్దరు అధినేతలకు ఊతంగా పై పార్టీల్లో ఎవరూ లేరంటే ఆశ్చర్యంగానే ఉంది. ఒకవైపు చంద్రబాబు మరోవైపు జగన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్ధుల విజయానికి ప్రచారంలో ఇద్దరు కూడా నానా అవస్తలు పడుతున్నారు.

 

హెలికాప్టర్లు తీసుకుని ఇద్దరూ రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీల్లో కూడా వీళ్ళ కష్టాన్ని పంచుకునే వారే కరువవటం విచిత్రంగా ఉంది. ఇక్కడ సమస్యేమిటంటే కొద్దో గొప్పో ధాటిగా మాట్లాడగలరు అని అనుకునే నేతలు కూడా పోటీ చేస్తుండటంతో వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితం కావాల్సొచ్చింది.

 

టిడిపినే తీసుకుంటే, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నందమూరి బాలకృష్ణ, కోడెల శివప్రసాద్, కెఇ కృష్ణమూర్తి తో పాటు నారా లోకేష్ కూడా ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు పరిమితమైపోయారు. పక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలన్నా బయటకు రాలేని పరిస్ధితి వాళ్ళది.

 

అదే సమయంలో వైసిపి కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. రోజా, అంబటి రాంబాబు, రాజేంద్రనాధ్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కొడాలినాని లాంటి వాళ్ళు తమ నియోజకవర్గాలకే పరిమితమైపోవాల్సొంచ్చింది. అందుకనే వాళ్ళు ఇతర నియోజకవర్గాల గురించి ఆలోచించే పరిస్దితి లేదు. వైసిపిలో సినీ సెటబ్రిటీలు ఆలీ, పృధ్విరాజ్, భానుచందర్ లాంటి వాళ్ళున్న వాళ్ళు కూడా ఎందుకో ఇంకా యాక్టివ్ కాలేదు.

 

ఈ నేపధ్యంలోనే జగన్ అమ్మ విజయమ్మ, సోదరి షర్మిల ఈనెలాఖరులో ప్రచారం మొదలుపెట్టనున్నారు. తల్లి విజయమ్మ పెద్ద వక్త కాకపోయినా ఏదో సెంటిమెంటు మాటలు మాట్లాడేందుకు పనికొస్తారు. షర్మిలకు మాత్రం క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉంది. గతంలో పాదయాత్రతో పాటు బహిరంగసభల్లో మాట్లాడిన అనుభవం ఉండటం షర్మిలకు ప్లస్సవుతుంది. వాళ్ళిద్దరూ ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తారని సమాచారం. వాళ్ళు గనుక ప్రచారం మొదలుపెడితే జగన్ కు కాస్త వెసులుబాటు దొరుకుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: