నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ త‌నయ, సిట్టింగ్ ఎంపీ క‌విత పోటీ చేస్తున్నందుకు కాదు. అన్న‌దాత‌ల ఆక్రోశం పెల్లుబికినందుకు. పసుపు, ఎర్ర జొన్నల మద్దతు ధర కోసం ఆందోళనలు చేసి విసిగి వేసారిన రైతులు పార్లమెంట్‌ బరిలో దిగుతామని నామినేషన్లు వేశారు. నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానానికి మొత్తం 236 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒకే రోజు 173 నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలు చేసినవారిలో 230 మంది రైతులు ఉన్నారు. 


పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు మద్దతు ధర కల్పించాలని సుదీర్ఘపోరాటం చేస్తున్న రైతులు... ఫిబ్రవరి నుంచి పలు దఫాలుగా ఆందోళన చేసినా అటు ఎమ్మెల్యేలు ఇటు ప్రభుత్వం స్పందించలేదు. పసుపు పంట క్వింటాల్‌కు రూ.15 వేలు, ఎర్రజొన్నలకు రూ.3500 చెల్లించాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని రైతు నాయకులను రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయాలని రైతు జేఏసీ నిర్ణయించింది. అనుకున్నట్టుగానే రైతులు నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లారు. 


ఇలా ఇప్ప‌టివ‌ర‌కు 176 మంది రైతులు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న సాగు చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పసుపు సాగు చేసే రైతులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. వీరంతా తాము సాగు చేసిన పసుపు, ఎర్రజొన్న పంటలకు సరిపడా గిట్టుబాటు ధర రావడం లేదంటూ గత కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో వినూత్న తరహాలో నామినేషన్ల వేశారు. కాగా, 236 అభ్యర్థులు రంగంలోకి ఉంటే.. ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులకు సవాల్‌గా మారింది.


ఇదిలాఉండ‌గా,  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రంగంలోకి దిగి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని స‌మ‌చారాం. టీఆర్‌ఎస్‌ అనుబంధంగా ఉండి గ్రామాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు, రైతులతో శనివారం సమావేశమయ్యారు. 'ఎర్రజొన్న రైతులకు లాభం చేస్తాం. గతంలో కొన్నదాని కంటే రూపాయి ఎక్కువే ఇస్తాం. ఇందుకోసం బోనస్‌ చెల్లిస్తాం. నామినేషన్లు విరమించేలా చూడాలి' అని దిశానిర్దేశం చేశారు. పసుపు పంటకు అవసరమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతామని చెప్పారు. మంత్రి నిర్వహించిన సమావేశానికి మీడియాను అనుమతించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: