ప్రముఖ నటుడు మోహన్ బాబు వైసిపి కండువా కప్పుకున్నారు. మోహన్ బాబు వైసిపిలో చేరటం చంద్రబాబునాయుడుకు ఇబ్బందికరమైన అంశమనే చెప్పాలి. ఎందుకంటే, మోహన్ బాబు, చంద్రబాబుల బంధం దాదాపు 40 ఏళ్ళుగా సాగుతోంది. చంద్రబాబు గురించి మోహన్ బాబుకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండరేమో ? రెండు వారాల్లో పోలింగ్ జరగనున్న సమయంలో మోహన్ బాబు వైసిపిలో చేరటం చంద్రబాబుకు పెద్ద షాకనే చెప్పాలి.

 

చాలాకాలంగా వైఎస్ కుటుంబంతో మోహన్ బాబుకు సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ కుటుంబంలోని అమ్మాయిని మోహన్ బాబు పెద్ద కొడుకు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ బంధుత్వం కారణంగా రాబోయే ఎన్నికల్లో మోహన్ బాబు కుటుంబంలో ఎవరో ఒకళ్ళు వైసిపి తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఎవరు కూడా ముందుకు రాకపోవటంతో పోటీ అనేది ఉత్త ప్రచారంగానే మిగిలిపోయింది.

 

అదే సమయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా వైసిపిలో అధికారికంగా చేరలేదు. అయితే ఈ మధ్యనే ప్రభుత్వంతో మొదలైన ఫీజు రీ ఎంబర్స్ మెంటు రగడతో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య రచ్చ రోడ్డెక్కింది. ఈరోజు హఠాత్తుగా మోహన్ బాబు లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డిని కలవటం, పార్టీ కండువా కప్పుకోవటం చకచక జరిగిపోయింది. బహుశా పోలింగ్ కు ఇంకా 17 రోజులుంది కాబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉందేమో. చంద్రబాబుతో రచ్చ రోడ్డున పడిన తర్వాతే మోహన్ బాబు నేరుగా వైసిపిలో చేరాలని అనుకున్నారేమో ? ఏదేమైనా రేపటి ఎన్నికల్లో మోహన్ బాబు గనుక ప్రచారానికి దిగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవేమో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: