పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న ఈ ఇద్ద‌రు నేత‌ల‌పై పంచ్‌లు పేల్చారు. నల్లగొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అని కోమ‌టిరెడ్డిపై కామెంట్ చేశారు. ఎంపీ గెలుపుపై నమ్మకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం కేటీఆర్‌ ప్రసంగించారు. అసెంబ్లీలో ఓడిన వారిని కాంగ్రెస్‌ మళ్లీ ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టిందని విమర్శించారు. ట్రక్కు గుర్తు చేసిన అయోమయం వల్లే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గెలిచారు. ఎంపీ గెలుపుపై నమ్మకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అది లేక‌పోవ‌డం వ‌ల్లే.... ఉత్తమ్‌.. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే పదవి పెట్టుకుని ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 


ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందునే ప్రజలు కేసీఆర్‌ వెంట ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ, టీడీపీ బేజార్‌ అయ్యాయని.. జిమ్మేదార్‌ అయిన నాయకుడినే ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ``రైతుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆరే. ఇల్లు నేనే కట్టిస్తాను.. పెళ్లి నేనే చేయిస్తానన్న ఏకైక సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శప్రాయం. 20వేల పైచిలుకు చెరువుల్ని బాగు చేసుకున్నాం. భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపిస్తే తెలంగాణకు లాభం.కాంగ్రెస్‌ నేతలను గెలిపిస్తే రాహుల్‌కు లాభం. టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల పార్టీ. ఇంటిపార్టీని వదిలిపెట్టి మందిని ఎందుకు గెలిపించాలి? 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపాలి. సీఎం కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.2వేల కోట్లతో యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.హైదరాబాద్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ రైలు వేస్తాం. అన్ని బీసీ కులాలకు ఎక్కువగా న్యాయం చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌. విదేశీ ఉపకార వేతనాల కోసం భారీగా నిధులు వెచ్చించాం` అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: