రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పార్టీల బలాబలాలకన్నా సామాజిక వర్గాల పట్టు, ప్రజాబలం ఉన్న వారే గెలిచి సత్తా చాటుతుంటారు. ఇక ఈ సారి కూడా ఇక్కడ అదే పంథాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ ఈ సీటుని బీజేపీకి కేటాయించింది. అక్క‌డ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్ మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే ఈసారి టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తున్న నేపథ్యంలో...ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు బరిలోకి దిగుతుండగా...జనసేన తరుపున బి‌వి రావు పోటీ చేస్తున్నారు.


టీడీపీ తరుపున పోటీ చేస్తున్న బీసీ నేత జయమంగళకి....ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. 2009లో ఆయ‌న ట్రైయాంగిల్ ఫైట్‌లో స్వ‌ల్ప తేడాతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ ఐదేళ్లు టీడీపీని బలోపేతం చేయడంలో జయమంగళ తన వంతు పాత్ర పోషించారు. గత నాలుగేళ్లుగా ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అలాగే పార్లమెంట్ పరిధిలో బలమైన అభ్యర్ధి మాగంటి బాబు ఉండటం కూడా జయమంగళకి కలిసిరానుంది. అటు సంక్షేమ పథకాలు అమలు...ఇటు నియోజకవర్గ నేతలు ఆయనకి మద్ధతు ఇవ్వడం ప్లస్. అయితే టికెట్ దక్కని నేతలు పైకి కలుపుగోలుగా ఉన్న...లోపల అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. మరి వీరూ ఎన్నికల్లో ఏ మేర సహకరిస్తారనేది చూడాలి.


అటు వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరావు నియోజకవర్గ ఇన్-చార్జ్‌గా ఉండి పార్టీని బలోపేతం చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై పోరాడుతూ..వారి మధ్యలోనే గడుపుతూ వచ్చారు. నాలుగేళ్ల పాటు ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండి పార్టీని బ‌లోపేతం చేయ‌డం చాలా వ‌ర‌కు క‌లిసి రానుంది. ఇక వైసీపీ శ్రేణుల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు దూలంకు మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. పైగా ఇక్కడ జనసేన పోటీ చేయడం కూడా వైసీపీకి మైనస్. దూలం కాపు సామాజికవర్గానికి చెందిన నేత. జనసేన పార్టీ నుంచి బీసీ నేత బి‌వి రావు పోటీ చేస్తున్నారు.  అయితే జనసేన పార్టీకి కాపు ఓటర్లు మద్ధతు ఎక్కువ అనేది బహిరంగ రహస్యం. ఇదే ఇప్పుడు వైసీపీ కొంప ముంచేలా కనిపిస్తోంది.


ఇక్కడ కాపు, బీసీ వర్గాల ఓట్లు ఎక్కువ. వీరే నేతల భవితవ్యాన్ని తెలుస్తారు. వీరు ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీ విజయం సులువు అవుద్ది. ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తుంటే ఇక్కడ జనసేన పార్టీ చీల్చే ఓట్లు బట్టే టీడీపీ-వైసీపీ అభ్యర్ధుల గెలుపోటములు డిసైడ్ అయ్యేలా ఉన్నాయి. దూలం కాపు వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతున్నా... జ‌య‌మంగ‌ళ బీసీ కావ‌డంతో కొల్లేరు గ్రామాల్లో ఉన్న ఆయ‌న సామాజిక‌వ‌ర్గం వ‌డ్డెర్లు ఆయ‌న‌కు వ‌న్‌సైడ్‌గా ఓటు వేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా కైక‌లూరులో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు త‌ప్ప‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: