ఆంధ్రా పారిస్‌గా పేరుగాంచిన గుంటూరు జిల్లా తెనాలిలో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరోసారి తెనాలి బరిలో నిలవగా...ఆలపాటి చేతిలో ఓడిపోయిన అన్నాబత్తుని శివ కుమార్ వైసీపీ తరుపున పోటీలో నిలిచారు. ఇక 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఉమ్మడి ఏపీకి స్పీకర్‌గా చేసిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆలపాటి...అభివృద్ధి మంత్రంతో ఈ ఐదేళ్లు ముందుకు వెళ్లారు. గ్రామాలకి సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, ఎన్టీఆర్ హౌసెస్ ఇలా అన్నీ రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కూడా పెద్ద పీఠ వేశారు. 


అయితే ఆలపాటి ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటూ... ఎటువంటి వివాదాల్లోనూ జోక్యం చేసుకోకుండా...నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద మంచి మార్కులు పడేలా చేసుకున్నారు. ఇది ఓ రకంగా ఆలపాటికి ప్లస్ అవుతున్నా... సీనియర్ నాయకులని దూరం చేసుకుని మైనస్ అయ్యేలా చేసుకున్నారు. ఇక ఆయ‌న చ‌ర్య‌ల‌తో ప‌ట్ట‌ణంలో ఎక్కువుగా ఉండే రెండు కీల‌క సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఆయ‌న‌కు దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. రాజా అంటే రుబాబు ఎక్కువైంద‌న్న టాక్ తెనాలిలో గ‌త మూడేళ్లుగా వినిపిస్తోంది. 


అటు గత ఎన్నికల్లో ఓడిపోయిన అన్నాబత్తుని శివ కుమార్... పాదయాత్రలు, గడప గడపకు వైసీపీ పేరుతో ఎల్లప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ వచ్చారు. అలాగే జగన్ పాదయాత్ర తర్వాత తెనాలిలో వైసీపీ బలం పుంజుకుంది. ఇవే శివకి ప్లస్ కానున్నాయి. శివ‌కుమార్‌కు సీటు వ‌స్తుందా ? అన్న సందేహం కూడా ఏర్ప‌డింది. ఆయ‌న క‌న్నా బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం వైసీపీ అన్వేషించింది. అయితే చివ‌ర‌కు శివ‌కుమార్ మోహ‌న్‌బాబుతో ఉన్న బంధుత్వం నేప‌థ్యంలో ఆయ‌న ద్వారా ఒత్తిడి చేసి మ‌రీ సీటు ద‌క్కించుకున్న‌ట్టు ప్ర‌చారం ఉంది. 


జనసేన నుంచి పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్‌కి నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఇక్కడ కాపు ఓటర్లు...నాదెండ్ల కుటుంబం అనుచరులు మనోహర్‌కి ప్లస్ కానున్నాయి. నాదెండ్ల కాకుండా ఇక్కడ వేరే ఎవరు పోటీలో ఉన్న టీడీపీ-వైసీపీల మధ్యే ఎన్నికల పోరు జరిగేది. నాదెండ్ల ఉండటం వలనే త్రిముఖ పోరు జరగడం ఖాయమైంది. ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలు బలమైన సామాజికవర్గంగా ఉంటూ...ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి తర్వాత పట్టణంలో వైశ్య, రూరల్‌ మండలాల్లో కాపు, కొల్లిప‌ర‌లో రెడ్డి సామాజికవర్గాలు భారీగానే ఉన్నాయి. వీరు ఎటువైపు మొగ్గు చూపితే..ఆ పార్టీ విజయం సాధించడం ఖాయమవుతుంది. ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తుంటే ఎవరు విజయం సాధిస్తారనేది చెప్పలేం. జనసేనకి కొంత విజయావకాశాలు తక్కువ ఉన్న...టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు మాత్రం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: