ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. పాల‌మూరు జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. బీజేపీ అభ్య‌ర్థి గెలుపు కోసం కృషి చేయాల‌ని కోరారు. ఏపీ, తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని ముందుగా పాల‌మూరు స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పాలమూరు గడ్డ ఎంతో త్యాగధనుల‌ గడ్డ అని ప్ర‌ధాని మోడీ అన్నారు. పాలమూరులో గెలిచిన కేసీఆర్ త‌న కుటుంబానికే న్యాయం చేసుకున్నారని, ప్ర‌జ‌ల్ని గాలి కొదిలేశారని మండిప‌డ్డారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్ణ‌యాన్ని ప్ర‌ధాని మోడీ త‌ప్పుప‌ట్టారు. ``కేసీఆర్ ముందస్తు ఎన్నికకు పోవడం వల్ల అదనపు భారం ప‌డింది. ఈ భారం ప్రజలు మోయలా? జ్యోతిష్కులు చెప్పినట్లు కేసీఆర్ ముందస్తు ఎన్నికకు వెళ్ళాడు. తెలంగాణ భవిష్యత్ ప్రజలు నిర్ణయించాలా?, జ్యోతిష్యులు నిర్ణయించాలా? మీరే చెప్పండి`` అని ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్  ఒక గూటి పక్షులే, కుటుంబం కోసం పనిచేస్తాయ‌ని ఆయ‌న ఆరోపించారు. 


తాను ప్ర‌జ‌ల చౌకిదార్ గా పనిచేయడానికి మరోసారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని మోడీ తెలిపారు. ``కాంగ్రెస్ ఏళ్ల తరబడి పాలన చూశారు, నా 5 ఏళ్ల పాలన చూశారు. మీ ఆశీర్వాదంతో దేశ రక్షణ,సురక్షణ‌ కోసం పనిచేస్తున్నాను.  స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థులు పనిచేస్తున్నారు, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. ప్ర‌ధాని కోసం మీ ఓటు వేయవద్దు,నయా భారత్ కోసమే మీ ఓట్ వేయండి. 5 ఏళ్ళ కాలంలో భారత్ సాధించిన కీర్తి మీకు తెలుసు.`` అని మోడీ వ్యాఖ్యానించారు.


ఒక వైపు దమ్మున్న చౌకిదారు, మరోవైపు అవినీతిపరులు,వారసత్వం ఉందని  ఎటువైపు ప్రజలు ఉంటారో తేల్చుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. 98 శాతం మరుగుదొడ్ల నిర్మాణచేసి మహిళల ఆత్మగౌరవం నిలబెట్టాం, 10 శాతం అగ్రవర్ణాల పేదలకు రిజ‌ర్వేషన్ ఇచ్చామ‌ని తెలిపారు. మండుటెండలో ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన మీకు ధన్యవాదాలు అని ప్ర‌ధాని తెలిపారు. మైభి చౌకిదారు అంటూ నినాదాలతో మోడీ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: