తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనాల్సిన కీల‌క స‌భలో చోటుచేసుకున్న ప‌రిణామాల విష‌యంలో విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స‌భ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రై ప్ర‌సంగించాల్సి ఉండ‌గా, ఆయ‌న గైర్హాజ‌రు అవ‌డంతో...అట్ట‌ర్ ప్లాప్ అవ‌డ‌మే కార‌ణ‌మా అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ సోష‌ల్ మీడియాలో హోరెత్తిస్తోంది.


తెలంగాణ నడిబొడ్డున హైద‌రాబాద్‌లో లాల్ బహదూర్ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ పార్ల‌మెంటు ఎన్నికల ప్రచార సభ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల్సి ఉంది. అయితే, హఠాత్తుగా ఆయ‌న రావ‌డం లేద‌ని స‌భా వేదిక‌గా నేత‌లు ప్ర‌క‌టించారు. దీనికి కార‌ణాలు ఇవే అంటూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసుకున్న స‌భ వెలవెల పోయింది.. పట్టుమని పది వేల మంది కూడా రాకపోవడంతో కేసీఆర్ సభకు రాకుండానే ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తోంది. 


నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల సభను ఒకే చోట నిర్వహించాల‌ని ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. నాయకుల మధ్య సమన్వయం లేమితో  గులాబీ నేతలు సరిగ్గా ప్రజలను తరలించ లేకపోయారు. మిర్యాలగూడ లోకసభ ప్రచారం ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి సభలో ఆశించినంత జనం లేరు అని తెలిసి సభకు రావ‌ద్ద‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. దీంతో, ముఖ్యమంత్రి రాడని తెలుసుకొని సభను గులాబీ నేతలు రద్దు చేసుకొని వెళ్లారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: