పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఐదేళ్లు గడిచిన సంస్థాగతంగా దానిని బలోపేతం చేయలేకపోయాడు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. పుణ్యకాలం కాస్తా గడిపేసి, ఎన్నికలు బాగా దగ్గరపడే వరకు సీరియస్‌ పొలిటీషియన్‌గా కనిపించని పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు సీఎం అవుతానని అంటున్నాడు. తాను సీఎం అయితే ఏమి చేస్తాననేది పదే పదే చెబుతూ ఓట్లు అడుగుతున్నాడు. అయితే పవన్‌ని మెజారిటీ ప్రజలు సీరియస్‌గా తీసుకోవడంలేదు. రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ చాలా చోట్ల పేరు తెలియని వారిని నిలబెట్టిన పవన్‌ కళ్యాణ్‌ పార్టీకి ఎన్నిచోట్ల డిపాజిట్లు దక్కుతాయనేది ఆసక్తికరమయింది.


ఈసారి ఎన్నికల్లో ఏమి చేయాలి, ఎలా అడుగులు వేయాలి అనే దానిపై పవన్‌కి మొదటినుంచీ క్లారిటీ లోపించింది. దానికితోడు పార్టీని నిర్మాణం చేయాల్సిన దశలో సినిమాలతో కాలక్షేపం చేస్తూ పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌గా వ్యవహరించాడు. ఈసారికి రెండు పెద్ద పార్టీలలో ఏదో ఒక దానితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికిప్పుడు పొలిటికల్‌ మార్పు తీసుకురావడం అసాధ్యమని పవన్‌కి ఇప్పటికైనా తెలిసిందో లేదో?


ఇదిలావుంటే పవన్‌ పోటీ చేస్తోన్న రెండు శాసనసభ స్థానాల్లో ఏదో ఒక్కటి మాత్రమే గెలుస్తాడని, అవతలి పార్టీలు తలచుకుంటే ఆ ఒక్కటి కూడా గెలవలేకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్‌ పార్టీకి వచ్చే సీట్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావచ్చునని బలమైన సంకేతాలు అందుతోన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు పవన్‌ ఉనికి నిలుపుకోగలడా లేక తిరిగి సినిమాలు చేసుకోవడానికి వచ్చేస్తాడా? 

మరింత సమాచారం తెలుసుకోండి: