విశాఖ  ఎంపీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తప్పదని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు రంగంలో ఉన్నా ఈసారి ఆ సమస్య బాగా కనిపిస్తోందని అంటున్నారు. దీనికంతటికీ టీడీపీ, జనసేనల  మధ్య లోపాయికారి అవగాహన ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. విశాఖ ఎంపీ ఎన్నికల విషయంలో టీడీపీ చివరి వరకూ నాన్చ‌డం, ఎంవీవీఎస్ మూర్తి మనవడికి టికెట్ ఇవ్వకుండా అనేక రకాల డొంక తిరుగుళ్ళు కధలు చెప్పి,  ఎన్నో కొత్త  పేర్లు  చక్కరులు కొట్టడం జరిగిన విషయం తెలిసిందే.  మొత్తానికి పంతానికి పోయి మామ బాలయ్య చలవతో శ్రీ భరత్ టీడీపీ టికెట్ తెచ్చుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. 


ఐతే ఇపుడు విశాఖ రాజకీయ వర్గాల్లో క్రాస్ ఓటింగ్ తప్పదన్న మాట జోరుగా సాగుతోంది. ఆ క్రాస్ ఓటింగ్ భయం ఇటు టీడీపీలోనూ, అటు వైసీపీలోనూ కూడా ఉండడం విశేషం. టీడీపీ విషయానికి వస్తే శ్రీ భరత్ ని డమ్మీని చేస్తున్నారని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం నేతలు భరత్ కంటే బీజేపీ ఎంపీ అభ్యర్ధి అదే  సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిపైన మక్కువ చూపుతున్నారట. కేంద్రంలో ఎటూ బీజేపీ అధికారంలోకి వస్తుందని, పురంధేశ్వరి కచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని విశాఖలోని కమ్మ సామాజిక వర్గం భావిస్తోంది. గతంలో  పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉంటూ చేసిన ఉపకారాలు గుర్తుకు తెచ్చుకుంటున్న వారంతా ఆమే ఓటు వేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే శ్రీ భరత్ ఎంపీ ఐతే ఏమీ లాభం లేదని కూడా భావిస్తున్నారుట.


ఇక ఇంకో టాక్ కూడా ఉంది. మొదట టీడీపీ అని తరువాత జనసేనలో చేరిన సీబీఐ మాజీ పోలీస్ అధికారి వీవీ లక్ష్మీ నారాయణ కోసం కూడా టీడీపీలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అంటున్నారు. టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలు ఒక ఓటు తమకు రెండవ ఓటు లక్ష్మీ నారాయణకు క్రాస్ చేస్తారని అంటున్నారు. అంటే కమ్మ సామజిక వర్గం బలంగా  ఉన్న చోట, వారు చెప్పే మాట వినే చోట ఓట్లు పురంధేశ్వరికి పడితే కాపులు ఎమ్మెల్యే అభ్యర్ధులుగా  ఉన్న చోట సొంతంగా రాజకీయం చేసే నేతలు తమ ఓటు జనసేన ఎంపీకి క్రాస్ చేస్తారని అంటున్నారు.



ఇక వైసీపీకి కూడా ఇపుడు క్రాస్ భయం పట్టుకుంది. ఆ పార్టీ కూడా కాపు ఎమ్మెల్యే అభ్యర్ధులకు టికెట్ ఇచ్చింది. వారు కూడా జనసేన వైపు మొగ్గితే కొంప కొల్లేరు అవుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారుట. ఇక కమ్మలంతా ఏకమై పురంధేశ్వరిని కోరుకున్న్నా కూడా వైసీపీ అభ్యర్ధికి పెద్ద నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా అదే సామాజిక వర్గం కావడం వల్ల ఇబ్బంది పడతారని చెబుతున్నారు. మొత్తానికి ఈ క్రాస్ ఓటింగ్ భయం అపుడే ఎంపీ అభ్యర్ధులను పట్టి పీడిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: