ఇంగితం ఉన్నవాళ్ళు ఎవరూ ఉద్యోగ సంఘాల నేతలపై ఈ సమయంలో చర్యలు తీసుకోరు. ఎందుకంటే, మరో  12 రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. సమస్యలేమన్నా ఉంటే పరిష్కరించుకుని వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటిది చంద్రబాబునాయుడు ఎందుకు రివర్సులో నడుస్తున్నారు ? సిపిఎస్ రద్దుకు ఉద్యమిస్తున్న ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయుల యాదవ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

మామూలుగానే చంద్రబాబుపై  ఉద్యోగులకు వ్యతిరేకమనే ముద్ర ఉంది. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు ఉద్యోగులతో  ఫ్రెండ్లీగా ఉంటానని చాలా సార్లే చెప్పారు. అయితే అదంతా ఉద్యోగులందరితోను కాదని అర్ధమైపోయింది. తనకు మద్దతుగా నిలబడే ఉద్యోగ సంఘాల్లోని కొందరు నేతల విషయంలో మాత్రమే చంద్రబాబు ఉదారంగా ఉంటున్నారని ఆచరణలో అందరికీ తెలిసిపోయింది.

 

అశోక్ బాబు, బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరుల విషయంలో మాత్రం చాలా ఉదారంగా ఉన్న చంద్రబాబు వైసిపికి మద్దతుగా నిలిచే ఉద్యోగ సంఘాల నేతలు, లేదా రాజకీయాలతో సంబంధం లేదంటూ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు చేసే నేతల విషయంలో మాత్రం కక్షపూరితంగా ఉంటున్నారు. తాజాగా రామాంజనేయుల యాదవ్ సస్పెన్షన్ అందులో భాగమే. సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు చంద్రబాబును ఎన్నిసార్లు కలిసినా పెద్దగా స్పందించలేదు.

 

అదే ఉద్యోగులు జగన్ కలిశారు. సిపిఎస్ రద్దుకు జగన్ ఎప్పుడో హమీ ఇచ్చారు. అదే విషయాన్ని తాజాగా తనను కలసిన ఉద్యోగులతో మరోమారు కూడా స్పష్టం చేశారు. దాంతో ఉద్యోగుల తరపున యాదవ్ హర్షం ప్రకటించారు. దాంతో చంద్రబాబుకే మండిందో ? లేకపోతే చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన ఉద్యోగుల సంఘాల్లోని నేతలకే మండిందో తెలీదు. మొత్తానికి రామాంజనేయుల యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. దాంతో సిపిఎఎస్ రద్దు కోసం ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులందరు చంద్రబాబంటే మండిపోతున్నారు.

రేపటి ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువే అనే ప్రచారం సాగుతోంది. అందుకు కొన్ని సూచనలు, సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో అందరినీ దగ్గరకు తీసుకోవాల్సిన చంద్రబాబు ఉద్యోగులను కూడా దూరం చేసుకుంటే ఎలాగ ?  ఉద్యోగుల సంఘం నేతపై చర్యలు తీసుకుంటే రేపటి ఎన్నికల్లో వారంతా టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేయరా ? ఏమిటో చంద్రబాబు చర్యలన్నీ రివర్సులో నడుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: