ఏపీలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు ఉన్నత వర్గాలకు చెందినవారు ఉంటే, మరోవైపు నిరుపేద వర్గాలకు చెందినవారు జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికల వార్ షురూ అయింది. గత 2014 ఎన్నికల పొత్తులో భాగంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన చొక్కాకుల వెంకటరావుపై విజయం సాధించారు. అయితే ఇప్పుడు పొత్తులు లేకపోవడంతో టీడీపీ తరుపున సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా...బీజేపీ అభ్యర్ధిగా విష్ణుకుమార్ రాజు మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కమ్మిల కన్నపరాజు, జనసేన నుంచి పసుపులేటి ఉషా కిరణ్ బరిలో ఉన్నారు. మామూలుగా రాష్ట్రంలో బీజేపీ పోటీలో లేదనే చెప్పాలి. కానీ ఈ ఒక్క చోట బీజేపీ గట్టి పోటీ ఇవ్వడానికి విష్ణు కుమార్ రాజునే కారణం. 


విష్ణు నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. కేవలం వ్యక్తిగత ఇమేజ్‌తోనే విష్ణు పోటీలో నిలవగలిగారు. కానీ రాష్ర్టానికి బీజేపీ అన్యాయం చేసిందని ప్రజలు భావిస్తున్న తరుణంలో విష్ణు విజయం సాధించడం కష్టమే. ఇక మొన్నటివరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జ్‌ లేరు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో టీడీపీ కేడర్‌లో జోష్ పెరిగింది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉండటం ప్లస్. ఇక జిల్లాలో గంటాకి మంచి పట్టుంది. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి అందాయి. ఇవన్నీ టీడీపీకి ప్లస్ కానున్నాయి. అయితే జనసేన, వైసీపీలు కూడా బలంగా ఉండటం మైనస్.


వైసీపీ అభ్యర్ధి కన్నపరాజు గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రతి సమస్యపై ఆయనకి అవగాహన ఉంది. అలాగే జగన్ ఇమేజ్..ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కన్నపరాజుకి కలిసొచ్చే అంశాలు. ఇక జనసేన తరుపున పసుపులేటి ఉషా కిరణ్ పోటీ చేస్తున్నారు. కాపు ఓటింగ్ ఎక్కువ ఉండటం...పవన్ ఇమేజ్‌తో జనసేన నెట్టుకురావాలి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా కాపులు సుమారు 70 వేల మంది ఓటర్లుండగా, 45 వేలు మంది వెలమలు ఉన్నారు. ఆ తర్వాత యాదవులు, క్షత్రియులు, ముస్లింలు ఉన్నారు.

టీడీపీ, జనసేన అభ్యర్ధులు కాపు సామాజికవర్గం కాగా, బీజేపీ, వైసీపీ అభ్యర్ధులు క్షత్రియులు. దీని బట్టి కాపు, క్షత్రియ ఓటర్లు ఎటువైపు ఉంటారనేది అర్ధమైపోతుంది. ఇక వెలమలు, యాదవులు టీడీపీ-వైసీపీలకి ఎక్కువ మద్ధతు ఉండొచ్చు. ముస్లింలు వైసీపీ వైపు మొగ్గు చూపుతారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ చతుర్మఖ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే టీడీపీ అభ్యర్ధి గంటాకే కొంత విజయావకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఎన్నికల సమయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో. 


మరింత సమాచారం తెలుసుకోండి: