అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు. చంద్రబాబు గుట్టుమట్ట్లులన్నీ మోహన్ బాబుకు తెలుసు. అన్నీ తెలిసిన కలెక్షన్ కింగ్ ని కెలకడం అంటే కొరివితో తల గోక్కోవడమే. ఈ హీరో కమ్  విలన్ గారి ఇగోని  బాబు గట్టిగానే దెబ్బ తీశారు. అంతే అదను చూసి మరీ బాబు మీద మాటల బాంబులే కురిపించేసారు మోహన్ బాబు


నీ అసలు అడ్రస్ టీడీపీ కాదు చంద్రబాబూ  అంటూ ఈ రోజు కొత్త  రకం రాజకీయం రుచి చూపించారు మోహన్ బాబు వైసీపీలో చేరిన తరువాత తొలిసారి విజయవాడలో మీడియా మీట్ పెట్టిన ఆయన బాబును చెడుగుడాడేశారు. నీ రాజకీయ పునాది ఎక్కడ. టీడీపీ పుట్టుకతో నీకు సంబంధం అసలు ఉందా. ఆ పార్టీలో ఆది నుంచి ఉన్నది నేను అంటూ మోహన్ బాబు సూటిగా  సుత్తి  లేకుండా చెప్పిన మాటలు బాబుకు గునపాలే మరి. అన్న గారి నుంచి పార్టీని అక్రమంగా లాగెసుకున్నంతమాత్రాన అది నీ పార్టీ అయిపోతుందా అంటూ మండిపడ్డారు.


జగన్ మీద కేసులు అంటున్నావ్. పైగా అవి రాజకీయంతో పెట్టిన కేసులని నీకు కూడా తెలుసంటూ కౌంటరేశారు. ఇక నీ మీద లేవా కేసులు అంటూ నిప్పులు చెరిగారు. అనుభవం అంటూ జగన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్, నీకున్న అనుభవం మొదటిసారి సీఎం అయినపుడు ఉందా అని ప్రశ్నిచారు. జగన్ ప్రజల మనసు గెలుచుకున్నాడు. ఆయన ఒకసారి సీఎం అయితే చాలు బ్రహ్మాండంగా పాలిస్తాడు అంటూ మోహన్ బాబు కితాబు ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇవ్వకుండా అనుభవం ఎలా వస్తుందని కూడా నిగ్గదీశారు.


చంద్రబాబు మాటల మరాఠీ అని, ఆయన్ని నమ్మి మోసపోవద్దంటూ మోహన్ బాబు జనాలకు విన్నపం చేశారు. బాబు జమానా అయిదేళ్ల పాలనంతా దారుణమని ఘాటు కామెంట్స్ చేశారు. ప్రజలు ఇచ్చిన‌ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబ పాలన చేస్తున్నాడని దుయ్యబెట్టారు. ఈసారి బాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఆరు నూరైనా జగన్ సీఎం అవడం ఖాయమని కూడా ఢంకా భజాయించారు. మొత్తానికి బాబు అండ్ బాబుల  మధ్య యుద్ధం మొదలైపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: