తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌లు రాజీనామా చెప్పిన సంగతి తెలిసిందే. వారిలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇంకొంద‌రు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ ప‌ర్వంలో తాజాగా ఇంకో షాక్ తగిలింది. సీనియర్‌ నేత, ఏఐసీసీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజనామా లేఖను అధినేత రాహుల్‌గాంధీకి పంపించారు.


కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్తూ రాహుల్ గాంధీకి రాసిన లేఖ‌లో పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గతానికి భిన్నంగా పార్టీలో ధన రాజకీయాలు పెరిగిపోయాయని.. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బిచ్చిన వారికే టికెట్లు దక్కాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అయిందన్న పొంగులేటి.. తాను పార్టీ వీడడానికి ఇదే కారణమని తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం కారణాంగా పార్టీ భ్రష్టుపట్టిపోయిందని.. ఇదే విషయాన్ని హైకమాండ్‌కు తెలియజేసినా ప్రయోజనం శూన్యం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ తీరును నిర‌సిస్తూ రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 


ఇదిలాఉండ‌గా, పార్టీకి రాజీనామా చేసిన పొంగులేటి సుధాకర్‌ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు తెలిసింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నట్టు తెలిసింది. పొంగులేటి పార్టీని వీడ‌టం పెద్ద దెబ్బ అని పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.ఇప్ప‌టికే మాజీ మంత్రి సీనియ‌ర్ నేత డీకే అరుణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: