‘జగన్ రౌడీలను తీసుకొచ్చి తునిలో రైలును తగలబెట్టారు’...ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన. ఎన్నికల ప్రచార సభలో తునిలో మాట్లాడుతూ అర్దంలేని ఆరోపణలు చేశారు. గుడ్డకాల్చి మీదేసయటంలో చంద్రబాబుకు మించిన వాడు లేరని అందరికీ తెలిసిందే.  తునిలో రైలు దహనానికి జగన్మోహన్ రెడ్డే కారణమైతే మరి ఇంత వరకూ ఎందుకు అరెస్టు చేయలేదు ?

 

దాదాపు రెండేళ్ళ క్రితం కాపు రిజర్వేషన్ల సాధన కోసం జరిగిన ఆందోళనలో భాగంగా తునిలో ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. హఠాత్తుగా కొందరు ఆందోళనకారులు పక్కనే వెళుతున్న రత్నాచల్ రైలును తగలబెట్టారు. సంఘటన జరగిన వెంటనే చంద్రబాబు అండ్ కో ఇదే విధమైన ఆరోపణలు చేశారు. రైలుక నిప్పుపెట్టింది రాయలసీమ గుండాలని, పులివెందుల రౌడీలని, జగనే చేయించాడంటూ చంద్రబాబు నుండి టిడిపిలోని క్రిందస్ధాయి నేత వరకూ ఒకటే ఊదర గొట్టారు.

 

సరే తర్వాత సిట్ జరిపిన విచారణలో భాగంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలువురిని అరెస్టులు చేశారు. పైగా అరెస్టయిన వారిలో కూడా ఎక్కువగా కాపు నేతలే ఉన్నారు. ఇదే కేసులో వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డిని కూడా సిట్ చాలాసార్లు పిలిపించి  విచారించింది. చంద్రబాబు చెబుతున్నదే నిజమైతే మరి ఘటన జరిగి రెండేళ్ళవుతున్నా ఇంత వరకూ జగన్ ను ఎందుకు అరెస్టు చేయలేదు ?

 

అసలు జరిగిన ఘటనపై సిట్ విచారణలో ఏం తేలింది ? విచారణ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదు ? రైలుకు నిప్పు పెట్టింది జగనే అయితే మరి పై జిల్లాల్లోని కాపు నేతలను మాత్రమే ఎందుకు అరెస్టులు చేసినట్లు ? చేసిన అరెస్టుల్లో ఒక్కరైనా వైసిపి నేతున్నారా ? పులివెందుల లేకపోతో రాయలసీమకు చెందిన అల్లరిమూకలెవరైనా ఉన్నారా ?

 

అసలు తుని ఘటనను ఇపుడే చంద్రబాబు ఎందుకు ప్రస్తావించినట్లు ? ఎందుకంటే, ఎన్నికలొచ్చాయి కాబట్టి. తుని సభలో జగన్ పై బురద చల్లేస్తే కాపులు నిజమని నమ్మేసి టిడిపికి ఓట్లేస్తారని చంద్రబాబు భ్రమపడుతున్నట్లున్నారు. జరిగిన ఘటనేమిటి ? బాధ్యులెవరో జనాలకు తెలీదా ? పోలింగ్ రోజున జనాలు ఏం చేస్తారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: