రాష్ట్రంలో హాట్ ఫైట్ జరిగే స్థానాల్లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఒకటి...మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ భూమా, గంగుల కుటుంబాల మధ్యనే హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా ఈ రెండు కుటుంబాల మధ్యనే టఫ్ ఫైట్ జరగనుంది. అయితే గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణానంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. తర్వాతి ఉప ఎన్నిక సందర్భంగా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక తర్వాత తండ్రి నాగిరెడ్డితోపాటు టీడీపీలో చేరారు. నాగిరెడ్డి చనిపోయాక అఖిల చంద్రబాబు కేబినెట్‌లో పర్యాటక మంత్రి కూడా అయ్యారు. ఈ క్రమంలోనే అఖిల మరోసారి టీడీపీ తరుపున ఎన్నికల బరిలో దిగారు. అటు గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు బిజేంద్రారెడ్డి వైసీపీ తరపున బరిలో నిలిచారు. ఇప్పటికే ఈ ఇద్దరు నియోజకవర్గంలో పోటాపోటిగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళుతున్నారు.


అయితే టీడీపీలో చేరి మంత్రి అయ్యాక అఖిల...నియోజకవర్గంలో వందల కోటలతో అభివృధ్ది కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకి అందేలా చేశారు. ఇవే ఇప్పుడు అఖిల గెలుపుకి కీలకం కానున్నాయి. వీటితో పాటు ఇక్కడ భూమా కుటుంబానికి మంచి పేరుంది...అలాగే యువనాయకురాలు అయిన అఖిల ముఠా తగాదాలని దూరంగా పెట్టింది. దీంతో అఖిలపై ప్రజల్లో అభిమానం పెరిగింది. కానీ అఖిల మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే టికెట్ దొరకక వైసీపీలో చేరడం ఇబ్బందికరంగా మారింది. అటు నియోజకవర్గంపై పట్టున్న ఏవీ సుబ్బారెడ్డి అఖిలకి ఏ మేర మద్ధతు ఇస్తారనేది కూడా అనుమానంగా ఉంది.


మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గంగుల బిజేంద్రరెడ్డి కుటుంబానికి ఆళ్ళగడ్డపై మంచి పట్టుంది. అలాగే సీనియర్ నేత రాంపుల్లారెడ్డి వర్గం బిజేంద్రకి సహకరిస్తున్నారు. అటు వైసీపీ కేడర్ కూడా ఇక్కడ బలంగా ఉంది..ఇవే ఇప్పుడు బిజేంద్రకి కలిసిరానున్నాయి. అయితే బిజేంద్ర తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగడం...ఆయన పెదనాన్న గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉండటం మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.


అటు జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ బీఎస్పీ పోటీ చేస్తుంది. దీంతో ప్రధాన పోటీ టీడీపీ-వైసీపీల మధ్య జరగనుంది. ఈ నియోజకవర్గంలో బలిజ, బీసీ, ఎస్సీ, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బలిజ కులం ఓటర్లు 42 వేల మంది ఉన్నారు. అలాగే బీసీలు 40 వేల వరకు ఉన్నారు. వీరే అభ్యర్ధుల గెలుపుని డిసైడ్ చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తుంటే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది. ఇద్దరికీ గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయి. మరి ఎన్నికల సమయంలో ఎలాంటి పరిణామాల చోటు చేసుకుంటాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: