రాష్ట్రంలో ఉన్న హాట్ సీట్లలో ముందు వరుసలో ఉండే మరో నియోజకవర్గం భీమవరం...ఎందుకంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. అయితే ఎప్పటి నుండో ఇక్కడ పాతుకుపోయిన టీడీపీ-వైసీపీ అభ్యర్ధులని పవన్ కల్యాణ్ ఎంతవరకు ఎదురుకుంటారు...వారిని ఢీకొని ఏ మేర గెలుపు పయనిస్తారు...అసలు ఏ పార్టీ బలం ఎంత ఉంది అనే విషయాలని ఒక్కసారి పరిశీలిస్తే... గత రెండు ఎన్నికల్లో భీమవరంలో గెలిచి మూడోసారి పోటీకి దిగుతున్నారు టీడీపీ అభ్యర్ధిగా పులపర్తి వీరాంజనేయులు(అంజిబాబు). ఈయన బలాబలాలు ఒక్కసారి చూస్తే.... పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండటం...ఇక్కడ పార్టీ కేడర్‌ పటిష్టంగా ఉండటం..సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు కావడం... చెక్కుచెదరని కొన్ని సామాజిక వర్గాల ఓట్లు టీడీపీ వైపే ఉండటం లాంటి అంశాలు అంజిబాబుకి ప్లస్ అవుతున్నాయి. 


మరోవైపు  వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ ఓటింగ్‌లో కీలకంగా ఉన్న బీసీలను తనవైపు తిప్పుకున్నారు. గ్రామాల్లో ముఖ్య నాయకులతో సమావేశాలు పెట్టి గ్రామీణ ఓటర్లని ఆకర్షించడం..గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి.. గ్రంధి శ్రీనివాస్‌కు ప్లస్ అవుతున్నాయి. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఆయ‌న‌కు ప్ల‌స్ కానుంది. ఇక ఇక్కడ జనసేన తరుపున ఏ అభ్యర్ధి నిలబడిన టీడీపీ-వైసీపీలలో ఒకటి గెలిచేది. కానీ పవన్ ఎంట్రీ ఇచ్చాక పరిస్థితులు మారిపోయాయి. దీంతో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగడం ఖాయమైంది. కేవలం ఇక్కడ కాపు సామాజికవర్గ ఓట్లు ఎక్కువ ఉండటం...వేలాదిగా పవన్ అభిమానులు ఉండటమే జనసేనకి ప్లస్ అవుతున్నాయి. అయితే డైరెక్ట్ పవన్ పోటీలో ఉండటం వలన కొంతమంది తటస్థంగా ఉన్న ఓటర్లు జనసేనవైపు తిరిగే అవకాశం ఉంది. అయితే పవన్ గెలుపు అంత సులువు కాదు. టీడీపీ-వైసీపీలు ఇంతే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వీరి పోటీని తట్టుకుని పవన్ ఏ మేర పవర్ చూపిస్తారో చూడాలి.


సామాజికవర్గాల ఓట్ల పరంగా చూస్తే... ఇక్కడ ఎక్కువ ఉన్నది కాపు సామాజిక వర్గమే. తర్వాత ఎక్కువ ఓట్లు బీసీలకు ఉన్నాయి. ఇందులో శెట్టిబలిజ, గౌడ, తూర్పుకాపు, మత్స్యకారులు ఉన్నారు. అటు రాజకీయాలలో కీలకపాత్ర వహించే క్షత్రియ సామాజిక వర్గం, వైశ్యులు, ఎస్సీ, ఎస్టీలు కూడా కీలకంగా మారారు. ఇప్పడు ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గాలకు చెందినవారు కావడం విశేషం. అయితే కాపులు ఎక్కువ పవన్ వైపు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత టీడీపీకి మద్ధతు ఇవ్వొచ్చు. బీసీలు మూడు పార్టీలకి మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. కొంతవరకు వారు వైసీపీ వైపే ఎక్కువ ఉన్నట్లు కనపడుతుంది.


అలాగే ఇక్కడ క్షత్రియులకు, కాపులకు పెద్దగా పడదనే విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో క్షత్రియ వర్గంతో వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ కూడా కొంత వైరం ఉంది. దీంతో వారు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీలు మూడు పార్టీలకి సమానంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. విజయావకాశాలు ఎవరి ఎక్కువ ఉన్నాయి అనేది కూడా చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: