జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రెండు నియోజవర్గాల్లోను తిప్పలు తప్పేట్లు లేదు. ఓ పార్టీ అధినేత రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం చాలా అరుదనే చెప్పాలి. ఎన్టీయార్ ఎప్పుడో రెండు సార్లు చేశారు. ఎన్టీయార్ తర్వాత ఇంకెవరూ పోటీ చేయలేదు, గెలవలేదు. మామూలుగా రెండు నియోజకవర్గాల నుండి పోటి చేయటానికి రెండు కారణాలుంటాయి. మొదటిది తన సత్తా చాటేందుకు. రెండో కారణం గెలుపుపై అనుమానంతోనే.

 

పవన్ విషయం తీసుకుంటే ఆయనకు సత్తా చాటేంత సీన్ లేదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే, పవన్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం రెండింటిలోను స్దానికుడు కాడు. పోనీ రెండు నియోజకవర్గాల్లో  దేనితో అయినా ప్రత్యేక అనుబంధముందా ? అంటే అదీ లేదు.  మెగా బ్రదర్స్ చిన్నప్పటి నుండి మొగల్తూరు గ్రామానికైనా ఏమైనా చేశారా ? అదీలేదు.  మొగల్తూరుకు ఏమీ చేయలేని వారు ఇక ఏమాత్రం సంబంధం లేని నియోజకవర్గాలకు ఏం చేస్తారు ?

 

అందుకనే పవన్ కు ఇపుడు రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు.  ఒకవేళ రెండు నియోజకవర్గాల్లోను గెలిచినా దేన్ని వదులుకుంటారు ? అంటే భీమవరంలో ఏమో భీమవరాన్నే వదిలేసుకుంటారని ప్రచారం జరుగుతోందట. అలాగే గాజువాకను వదిలేసుకుంటారని గాజువాకలో ప్రచారం జరుగుతోందట. పైగా భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా పవన్ పై బాగా గుర్రుగా ఉన్నారని సమాచారం. భీమవరంలో అసలే రాజుల ప్రాభల్యం ఎక్కువ.

 

గాజువాకలో స్ధానికులను గెలిపిస్తే కనీసం ఏదో ఒకసారి కాకపోతే మరోసారైన కనిపిస్తారనే టాక్ నడుస్తోందట. అదే పవన్ ను గెలిపిస్తే కలవాలంటే హైదరాబాద్ కో, అమరావతికో వెళితే తప్ప కలవటం సాధ్యం కాదనే ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతోంది. విచిత్రమేమిటంటే రెండు నియోజకవర్గాల్లోను ఇదే విధమైన ప్రచారం అంతకంతకు పెరుగుతోంది. మరి స్ధానికత, కాపు, రాజులనే సెంటిమెంటు అంశాలు చర్చకు వచ్చిన తర్వాత పవన్ గెలుపు అంత ఈజీనా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: